Begin typing your search above and press return to search.

కోడెలపై కేసు... అభియోగాలు ఏంటంటే?

By:  Tupaki Desk   |   16 April 2019 1:49 PM GMT
కోడెలపై కేసు... అభియోగాలు ఏంటంటే?
X
ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన తాజా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఎట్టకేలకు కేసు నమోదు అయిపోయింది. టీడీపీ సీనియర్ నేతగానే కాకుండా మాజీ మంత్రిగా మంచి గుర్తింపు కలిగిన కోడెలపై కేసు అంటే ఓకే గానీ.. స్పీకర్ గా వ్యవహరించిన నేతపై కేసు అంటేనే మరక అనే చెప్పక తప్పదు. అది కూడా ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన వ్యవహారంలో కోడెలపై కేసు నమోదు కావడం నిజంగానే పెద్ద విషయం కిందే లెక్క. కోడెలతో పాటు 22 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసు నమోదు చేసిన గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీసులు... ఆ కేసులో కోడెలను ఏ3గా పేర్కొన్నారు.

ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే... గడచిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోడెల విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో కోడెల స్పీకర్ అయిపోయారు. స్పీకర్ గా వ్యవహరించిన సమయంలోనూ కోడెలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. స్పీకర్ స్థానంలో ఉన్న నేత... పార్టీలతో ప్రమేయం లేకుండా వ్యవహరించాల్సి ఉండగా... కోడెల మాత్రం అందుకు విరుద్ధంగా.. స్పీకర్ గా ఉంటూ కూడా కోడెల టీడీపీ పక్షపాతిగానే వ్యవహరించారని విపక్షం వైసీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ ఎన్నికల్లో మరోమారు సత్తెనపల్లి నుంచే టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోడెల... తన గెలుపు కోసం చాలానే కష్టపడ్డారు. ప్రచారంలో తనదైన మార్కుతో దూసుకెళ్లారు. చివరి దాకా ప్రచారాన్ని హోరెత్తించిన కోడెల.... పోలింగ్ రోజున తన నియోజకవర్గ పరిధిలోని ఇనిమెట్ల గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద హల్ చల్ చేశారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లిన కోడెల... ఏకంగా బూత్ తలుపులు మూసివేయించారు. దాదాపు అరగంటకు పైగానే కోడెల బూత్ లోనే ఉండిపోయారు. అయితే అప్పటిదాకా సహనంతోనే ఉండిపోయిన ఓటర్లు, వైసీపీ సానుభూతిపరులు ఆ తర్వాత కోడెలపై విరుచుకుపడ్డారు. బూత్ తలుపులు ఎలా మూస్తారంటూ ఏకంగా కోడెలపై దాడి చేశారు. ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించిన తీరుపైనా విమర్శలు రేకెత్తాయి. కోడెలపై దాడి చేశారన్న ఆరోపణల మీద వైసీపీకి చెందిన కేసులు నమోదు చేసిన పోలీసులు... పోలింగ్ బూత్ ను తన అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన కోడెలపై మాత్రం కేసు నమోదు చేయలేదు.

ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీని కూడా వేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయగా... నేటి ఉదయం రాజ్ భవన్ కు వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ కూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై పరిశీలన చేసిన పోలీసు ఉన్నతాధికారులు కోడెలపై కేసు నమోదు చేయాలని తీర్మానించారు. దీంతో ఇనిమెట్లకు సమీపంలోని రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కోడెలతో పాటు 22 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోడెలను ఏ3గా చేర్చిన పోలీసులు... పోలింగ్ బూత్ ను స్వాధీనం చేసుకునేందుకు కోడెల యత్నించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.