Begin typing your search above and press return to search.

షర్మిల ప్రస్తావన తెచ్చిన జేసీ..

By:  Tupaki Desk   |   28 Dec 2018 12:48 PM GMT
షర్మిల ప్రస్తావన తెచ్చిన జేసీ..
X
జగన్‌ ను ఎదుర్కోలేక... ఆయన పట్ల ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ.. ఆయన కుటుంబంలోని మహిళలనూ వివాదాల్లోకి లాగుతున్నారంటూ వైసీపీ నాయకులు - జగన్ అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అనవసరంగా షర్మిళ ప్రస్తావన తెచ్చి రాజకీయం చేయడంపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

జగన్ కులం ప్రాతిపదికన ఓట్ల అడుగుతున్నారని ఆరోపించిన జేసీ దివాకరరెడ్డి ఆ తరువాత షర్మిళ ప్రస్తావన తెచ్చారు.. “ రెడ్డి.. రెడ్డి.. రెడ్డి.. అంటూ వైఎస్ జగన్ కుల ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారు. పెళ్లిళ్లు చేసుకునేటప్పుడు, చేసేటప్పుడు కులం అడ్డు రాదు. కానీ ఓటు వేసేటప్పుడు కులం ఎందుకు? సత్తా ఉంటే సీఎంలు అవుతారు తప్ప కులం పేరు చెప్పుకుంటే సీఎంలు కారు. మీ చెల్లెలు షర్మిల ఏ కులస్థుడిని వివాహం చేసుకుంది జగన్ - బ్రాహ్మణుడిని చేసుకుంది కదా అందరూ ఒకటేనన్న భావనతోనే ఆమె పెళ్లి చేసుకుంది. నువ్వు రెడ్ల పేరు చెప్పి తిరుగుతున్నావు. రెడ్లు అయితే కొమ్ములున్నాయా? కులాల పేరు - మతాల పేరు చెప్పుకుంటే సీఎంలు కారు. పదవులు రావు. అలా వచ్చేదే ఉంటే అంతా కులాల పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేవారు. ఇప్పటికైనా అసలు విషయం గమనించి ప్రజలందరిని సమానంగా చూడడం నేర్చుకో’’ అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జెసి దివాకర్ రెడ్డి ఇంత దురుసుగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయమవుతున్నాయి. బుర్రలో ఏది తోస్తే అది మాట్లాడే జేసీ ఏదో మామూలుగా ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవడానికి వీల్లేదని.. కుట్రపూరితంగా - వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అనంతపురంలో టీడీపీకి పరిస్థితులు గడ్డుగా ఉండడంతో ఇలా రెడ్డేతర కులాల ఓట్ల కోసం వారిని రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.