Begin typing your search above and press return to search.

గురజాలలో ఎమర్జెన్సీ ఎందుకు అని?

By:  Tupaki Desk   |   13 Aug 2018 6:32 AM GMT
గురజాలలో ఎమర్జెన్సీ ఎందుకు అని?
X
గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలో ఉన్న‌ గుర‌జాల నియోజ‌క వ‌ర్గంలో వెలుగులోకి వ‌చ్చిన అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. సాక్ష్యాత్తూ గురజాల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావు క‌నుస‌న్న‌ల్లోనే 290 కోట్ల విలువైన‌ అక్ర‌మ మైనింగ్ జ‌రిగింద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ వ్య‌వ‌హారంలో య‌ర‌ప‌తినేనికి హైకో్ర్టు నోటీసులు కూడా పంపించింది. ఈ నేప‌థ్యంలో నేడు పిడుగురాళ్ల - దాచేపల్లిలోని అక్రమ మైనింగ్ క్వారీల‌లో ప‌ర్య‌టించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిజనిర్ధారణ కమిటీ నిర్ణయించింది. అయితే, ఆ క‌మిటీ ప‌ర్య‌టిస్తే నిజానిజాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని....వైసీపీ నేత‌ల‌పై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తిని ఇవ్వ‌కుండా అడ్డుకున్న పోలీసులు.....స్థానికి వైసీపీ నేత‌ల‌ను హౌస్ అరెస్టు చేశారు. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించేందుకు రాష్ట్రం న‌లుమూల‌ల‌నుంచి వ‌స్తోన్న వైసీపీ ఎమ్మెల్యేల‌ను - కీల‌క నేత‌ల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ‌ అరెస్టు చేస్తున్నారు. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గాన్ని పోలీసులు త‌మ అధీనంలోకి తీసుకున్నారు. కమిటీని అడ్డుకునేందుకు పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించి దాచేపల్లి - పిడుగురాళ్ల ప్రాంతాల్లో 144 సెక్షన్‌ ను అమలు చేస్తున్నారు.

వైసీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. వైసీపీ కమిటీ పర్యటిస్తే అక్రమ మైనింగ్ బాగోతం బ‌ట్ట‌బ‌య‌ల‌వుతుంద‌ని ప్ర‌భుత్వం భ‌య‌ప‌డింది. దీంతో, నేటి పర్యటన రద్దు చేసుకోకపోతే కేసులు పెడతామని స్థానికి వైసీపీ నేత‌ల‌ను పోలీసులు నిన్న హెచ్చరించి నోటీసులు పంపించారు. అంతేకాకుండా, నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క‌మైన నేత‌ల‌ను హౌస్ అరెస్టు చేశారు. నేడు ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తోన్న నేత‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టు చేసి స్టేష‌న్ల‌కు త‌ర‌లిస్తున్నారు. కాజా టోల్ గేట్ వ‌ద్ద బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను పోలీసులు అడ్డుకున్నారు. బొత్స‌తోపాటు గుంటూరు ఎమ్మెల్యే ముస్త‌ఫా - గుంటూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మ‌న్ లేళ్ల అప్పిరెడ్డిని దుగ్గిరాల పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. న‌డికుడిలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు. ఆయ ప్ర‌యాణిస్తోన్న రైల్లో నుంచి బ‌ల‌వంతంగా దించి అరెస్టు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి - పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి - వైసీపీ గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ కాసు మహేష్‌ రెడ్డిని నిన్న అర్ధ‌రాత్రి పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. న‌ర‌స‌రావుపేట‌లో కాసు మ‌హేష్ రెడ్డి ఇంటి వ‌ద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి మ‌రీ మ‌హేష్ ను అడ్డుకున్నారు. గురజాల నియోజకవర్గాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక నేత‌లు - కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్‌ చేసి కేసులు పెడుతున్నారు. కొంత‌మందిని హౌస్ అరెస్టు చేశారు.