Begin typing your search above and press return to search.

కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీని వీడుతున్న నేత‌లు.. ఈసారి క‌ష్ట‌మేనా?

By:  Tupaki Desk   |   2 Sep 2022 2:30 PM GMT
కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీని వీడుతున్న నేత‌లు.. ఈసారి క‌ష్ట‌మేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్సీపీ అత్యంత బ‌లంగా ఉన్న జిల్లాల్లో క‌ర్నూలు ఒక‌టి. ఈ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల‌ను, 2 పార్ల‌మెంటు స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజ‌య‌భేరి మోగించింది. అన్ని స్థానాల‌ను క్లీన్ స్వీప్ చేసింది. ప్ర‌తిప‌క్షాల‌కు ఒక్క‌టి కూడా రాలేదు.

అయితే ఈసారి మాత్రం ప‌రిస్థితి ఇంత ఏక‌పక్షంగా ఉండ‌ద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్సార్సీపీ నేత‌ల మ‌ధ్య కుమ్ములాట‌లు, ఆధిప‌త్య పోరు ఉంద‌ని స‌మాచారం. ముఖ్యంగా బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీ అధిష్టానానికి త‌ల‌పోటు తెస్తోంద‌ని అంటున్నారు. బ‌న‌గాన‌ప‌ల్లెలో గ‌త ఎన్నిక‌ల్లో కాట‌సాని రామిరెడ్డి గెలుపొందారు. క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయంగా పేరున్న కుటుంబాల్లో కాట‌సాని కుటుంబం ఒక‌టి. కాట‌సాని రామిరెడ్డి 2009లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌ఫున బ‌న‌గాన‌ప‌ల్లె నుంచి గెలుపొందారు.

ఆ త‌ర్వాత కాట‌సాని వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో బ‌న‌గాన‌ప‌ల్లె నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన కాట‌సాని రామిరెడ్డి టీడీపీ అభ్య‌ర్థి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. 2019లో గెలిచిన కాట‌సాని మొద‌టి నుంచి పార్టీలో ఉన్న‌వారికి కాకుండా జూనియ‌ర్ల‌కు ప‌ద‌వులు ఇస్తున్నార‌ని.. వారికే ప్రాధాన్య‌త ద‌క్కుతోంద‌ని అంటున్నారు. ఈ ఆరోప‌ణ‌లు చేస్తోంది ఎవ‌రో బ‌య‌ట‌వారు కాదు.. సాక్షాత్తూ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి కుటుంబంలోని వారేనని వార్తలు వ‌స్తున్నాయి.

కాట‌సాని రామిరెడ్డి అన్న కుమారుడు కాటసాని రమాకాంత్ రెడ్డి ప్ర‌స్తుతం అవుకు మండలం గుండ్ల సింగవరం సర్పంచ్ గా ఉన్నారు. వైసీపీ కి గుడ్ బై…. సారి సీఎం జగన్ అంటూ ఈ మధ్య రమాకాంత్ రెడ్డి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టింగ్ పెట్టార‌ని చెబుతున్నారు. ర‌మాకాంత్ రెడ్డి త్వ‌ర‌లో మరో పార్టీలో చేరేందుకు నిర్ణయించార‌ని తెలుస్తోంది.

త‌న తండ్రి కాటసాని శివరామిరెడ్డి కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకొని ఫ్యాక్షన్‌ గొడవలకు బలయ్యార‌ని.. అయితే త‌న బాబాయి కాట‌సాని రామిరెడ్డి తనకు రాజకీయ ఎదుగుదల లేకుండా చేశారనే అసంతృప్తి ర‌మాకాంత్ రెడ్డికి ఉంద‌ని చెబుతున్నారు. కాటసాని రామిరెడ్డి తన కుమారుడు ఓబులరెడ్డిని నాయ‌కుడిగా తీర్చిదిద్దుతూ ఆయ‌న‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని.. ఇలాగైతే తాను ఎప్పుడు ఎదుగుతాన‌నే అభిప్రాయంతో ర‌మాకాంత్ రెడ్డి ఉన్నార‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు మొద‌టి నుంచి కాటసాని రామిరెడ్డి ముఖ్య అనుచరుడుగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్న కాట్రేడ్డి మల్లికార్జున రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. చాలా కాలంగా రామిరెడ్డితో ఉంటున్న‌ప్ప‌టికీ త‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తితో మ‌ల్లికార్జున‌రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. సొంత కుటుంబ సభ్యులకు, త‌న కంటే జూనియ‌ర్ల‌కు ప్రాధాన్య‌త‌ ఇస్తూ.. వారికే ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నార‌ని మ‌ల్లికార్జున‌రెడ్డి ఆరోపిస్తున్నార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.

మ‌ళ్లీ ఇంత‌లోనే కాట‌సాని రామిరెడ్డి అన్న కుమారుడు రమాకాంత్ రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యుల ద్వారా ఎమ్మెల్యే రామిరెడ్డి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. కానీ రమాకాంత్‌రెడ్డి ఒప్పుకోవడం లేదని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో కీల‌క నాయ‌కుల రాజీనామాల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌న‌గాన‌ప‌ల్లెలో వైఎస్సార్సీపీ గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.