Begin typing your search above and press return to search.

బాబుపై ఈసీకి కంప్లెయింట్ వెళ్లిందండోయ్‌!

By:  Tupaki Desk   |   17 July 2017 12:13 PM GMT
బాబుపై ఈసీకి కంప్లెయింట్ వెళ్లిందండోయ్‌!
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నికకు సంబంధించి రోజుకో సంచ‌ల‌నం న‌మోద‌వుతోంది. దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించిన భూమా... ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు పార్టీ మారిపోయారు. త‌న వెంట త‌న కూతురు - ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా ఉన్న భూమా అఖిల‌ప్రియ‌ను కూడా ఆయ‌న టీడీపీలోకి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు నంద్యాల‌కు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నికలో భూమా సోద‌రుడు శేఖర్ రెడ్డి కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతుండ‌గా, మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి వైసీపీ త‌ర‌ఫున పోటీలోకి దిగేశారు. మూడేళ్ల త‌మ పాల‌న‌కు నంద్యాల ఉప ఎన్నిక అద్దం ప‌ట్ట‌నుంద‌ని చెబుతున్న అధికార పార్టీ టీడీపీ.. ఎలాగైనా నంద్యాల అసెంబ్లీని కైవ‌సం చేసుకుని 2019 ఎన్నిక‌ల‌కు ధీమాగా వెళ్లాల‌ని ఉవ్విళ్లూరుతోంది.

ఈ క్ర‌మంలో మొన్నామ‌ధ్య నంద్యాల వెళ్లిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేలా వ్యాఖ్యలు చేశార‌న్న వార్త‌లు వినిపించాయి. తాను వేసిన రోడ్ల‌పై న‌డ‌వాలంటే త‌న‌కు ఓటు వేయాల్సిందేన‌ని ఆయ‌న అన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాకుండా పెన్ష‌న్లు ఇస్తున్నాన‌ని, రేష‌న్ కూడా ఇస్తున్నాన‌ని, ఇన్ని చేస్తున్న త‌న పార్టీ త‌ర‌ఫున నిలిచే అభ్య‌ర్థికి కాకుండా వేరే పార్టీ అభ్య‌ర్థిగా ఎలా ఓటేస్తార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టికైతే... ఈ ప్ర‌చారం బాగా త‌గ్గిపోయింద‌నే చెప్పాలి. అయితే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేలా ఎలా మాట్లాడ‌తార‌న్న వాద‌న వినిపించిన విప‌క్ష వైసీపీ... కాసేప‌టి క్రితం కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చంద్ర‌బాబుపై ఫిర్యాదు చేసింది.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌ లో పాల్గొన్న అనంత‌రం వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి త‌మ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి - వైఎస్ అవినాశ్ రెడ్డి - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి - వ‌ర‌ప్ర‌సాద్ త‌దిత‌రుల‌తో క‌లిసి కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఏకే జోతిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు ఏపీలో అధికార పార్టీ టీడీపీ, ఆ పార్టీ అధినేత‌, సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులోని అంశాల‌ను ప‌రిశీలిస్తే... నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని వారు సీఈసీ ఫిర్యాదు చేశారు. టీడీపీకి ఓటు వేయకుంటే రోడ్డుపై ఎలా తిరుగుతారు, పార్టీకి ఓటు వేయకుంటే అభివృద్ధి పనులు ఆపివేస్తామని బెదిరిస్తున్నారని, అలాగే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.50 లక్షలు ఇస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి పట్టుబడ్డారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఏకే జోతికి వినతిపత్రం సమర్పించారు.

నంద్యాల ఓట‌ర్ల‌ను టీడీపీ నేత‌లు ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నార‌ని, ఇందుకోసం ఏకంగా పదిమంది మంత్రులు అక్కడే మకాం వేసి అరాచకాలు చేస్తున్నారన్నార‌ని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. పలువురు అధికారులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇక త్వ‌ర‌లో జ‌రిగే నంద్యాల ఉప‌ ఎన్నికలు పాదర్శకంగా జరిగేలా కేంద్ర బలగాలను పంపించాలని సీఈసీని కోరారు. ఫిర్యాదుతో పాటు నంద్యాల‌లో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు, తెలంగాణ‌లో చోటుచేసుకున్న ఓటుకు నోటు కేసు సీడీల‌ను కూడా వైసీపీ ఎంపీలు సీఈసీకి అంద‌జేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదును, వైసీపీ స‌మ‌ర్పించిన ఆధారాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎలా స్పందిస్తుంద‌న్న దానిపై ఇప్పుడు ఆస‌క్తికర చ‌ర్చ‌కు తెర లేసింద‌నే చెప్పాలి.