Begin typing your search above and press return to search.

విశాఖ‌లో చంద్ర‌బాబుకు భంగ‌పాటు..సంబంధం లేద‌న్న వైఎస్సార్సీపీ!

By:  Tupaki Desk   |   27 Feb 2020 3:30 PM GMT
విశాఖ‌లో చంద్ర‌బాబుకు భంగ‌పాటు..సంబంధం లేద‌న్న వైఎస్సార్సీపీ!
X
విశాఖ‌ప‌ట్ట‌ణంలో తెలుగుదేశం పార్టీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడును అడ్డుకోవ‌డం వ్య‌వ‌హారంతో త‌మ‌కు సంబంధం లేద‌ని అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం అధినేత‌ను విశాఖ ప్ర‌జ‌లు అడ్డుకున్నార‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు. గ‌త ఆరు నెల‌లుగా చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును విశాఖ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూ ఉన్నార‌ని, ఆయ‌న తీరుపై నిర‌స‌న‌తోనే ఆయ‌న‌ను అక్క‌డి ప్ర‌జ‌లు అడ్డుకున్నార‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు అనేక సార్లు అనుచితంగా మాట్లాడార‌ని - దాని ఫ‌లిత‌మే ఇప్పుడు ఆయ‌న‌ను అడ్డుకోవ‌డం అని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

ఏపీకి మూడు రాజ‌ధానులు అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి చంద్ర‌బాబు నాయుడు అస‌హ‌నంతో ర‌గిలిపోతున్న విష‌యాన్ని వైసీపీ నేత‌లు గుర్తు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం అధినేత విశాఖ విష‌యంలో అనుచితంగా మాట్లాడార‌ని - విశాఖ‌కు తుఫాన్లు వ‌స్తాయి - రాజ‌ధానిగా ప‌నికిరాదు అంటూ చంద్ర‌బాబు నాయుడు మాట్లాడార‌ని వైసీపీ నేత‌లు గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకు ఫ‌లితంగానే ఇప్పుడు ఆయ‌న‌కు తిరుగుబాటు ఎదురైంద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

ఈ వ్య‌వ‌హారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, ప్ర‌భుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేద‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వం చంద్ర‌బాబు నాయుడును అడ్డుకోలేద‌ని - ఆయ‌న యాత్ర‌కు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుప‌డ‌లేద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో విశాఖ‌లో భారీ ఎత్తున భూముల ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగాయ‌ని, ఆ ఆక్ర‌మ‌ణ‌ల‌పై అప్పుడే సిట్ కూడా వేశార‌ని వైసీపీ నేత‌లు గుర్తు చేశారు. ఆ సిట్ వ్య‌వ‌హారం ఇంకా తేల‌ని నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు పై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం ఉంద‌న్నారు. విశాఖ‌కు రాజ‌ధాని వ‌ద్దు అంటూ చంద్ర‌బాబు నాయుడు యావ‌త్ ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నార‌ని, అందుకే ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను ప్ర‌జ‌లు అడ్డుకున్నార‌ని వైసీపీ నేత‌లు వ్యాఖ్యానించారు. అంతే కానీ ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవ‌డం వెనుక ప్ర‌భుత్వ హ‌స్తం కానీ, వైసీపీ హ‌స్తం కానీ లేద‌ని వారు వ్యాఖ్యానించారు.