Begin typing your search above and press return to search.

వైసీపీ నేత‌ల‌ను ఈడ్చేశారు!... గాయ‌ప‌రిచారు!

By:  Tupaki Desk   |   20 Nov 2017 8:49 AM GMT
వైసీపీ నేత‌ల‌ను ఈడ్చేశారు!... గాయ‌ప‌రిచారు!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల్సిందేన‌న్న ఉద్య‌మాలు ఇంకా చ‌నిపోలేద‌నే చెప్పాలి. గ‌తంలో దాదాపుగా అన్ని ప‌క్షాలు కూడా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం డిమాండ్ చేయ‌గా... ఇప్పుడు కొన్ని ప‌క్షాలు ఆ వాద‌న‌ను ప‌క్క‌న పెట్టేశాయి. అయితే విప‌క్షంలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీతో పాటు వామ‌ప‌క్షాలు మాత్రం ఈ వాద‌న‌ను ఇంకా విడిచిపెట్ట‌లేద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాద‌యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... తాను ప్ర‌సంగించిన ప్ర‌తి చోటా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌ర‌త ఎంత ఉంద‌న్న విష‌యాన్ని ప‌దే ప‌దే చెబుతున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం తాము ఎంత‌దాకా అయినా వెళ‌తామ‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు. ఇక వామ‌ప‌క్షాలు - చ‌ల‌సాని శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన‌ ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి ఇప్ప‌టికీ ప్ర‌త్యేక హోదా కోసం ఎక్క‌డో ఒక చోట ఉద్య‌మం చేస్తూనే ఉన్నాయి.

అయితే ఈ మూడు ప‌క్షాలు కూడా ఒక్క‌టిగా క‌లిసి చ‌లో అసెంబ్లీకి ప్ర‌ణాళిక‌లు ర‌చించుకున్న విష‌యం తెలిసిందే. అనుకున్న‌ట్లుగానే ఈ మూడు ప‌క్షాల‌కు చెందిన నేత‌లు నేటి ఉద‌యం విజ‌యవాడ నుంచి వెల‌గ‌పూడిలోని తాత్కాలిక అసెంబ్లీ వ‌ద్ద‌కు చ లో అసెంబ్లీ పేరిట ఉద్య‌మాన్ని ప్రారంభించాయి. అయితే వీరు కాస్తంత దూరం న‌డ‌వ‌గానే అడ్డుప‌డ్డ పోలీసులు... చ‌లో అసెంబ్లీకి అనుమ‌తి లేద‌ని, అసెంబ్లీ దాకా వెళ్ల‌నిచ్చేది లేద‌ని కూడా తేల్చి చెప్పారు. అయితే న్యాయ‌మైన త‌మ డిమాండ్‌ ను సాధించుకునేందుకు ఉద్య‌మం చేసి తీర‌తామ‌ని ఉద్య‌మ‌కారులు బ‌దులిచ్చార‌ట‌. అంతే ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎంత‌కీ ఉద్య‌మ‌కారులు త‌గ్గ‌డం లేద‌ని భావించిన పోలీసులు... ఉద్య‌మానికి దిగిన మూడు ప‌క్షాల నేత‌ల‌ను అరెస్ట్ చేసేందుకే నిర్ణ‌యించేశారు.

అనుకున్న‌దే త‌డ‌వుగా వైసీపీ నేత‌లు మ‌ల్లాది విష్ణు - సామినేని ఉద‌య‌బాను - జోగి ర‌మేశ్‌ - పైలా సోమినాయుడు - సీపీఐ నేత రామకృష్ణ త‌దిత‌రుల‌తో పాటు చోటా మోటా నేత‌లంద‌రిని అదుపులోకి తీసుకునే క్ర‌మంలో వారంద‌రినీ ఈడ్చుకుంటూ పోలీసులు వ్యాన్ల వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. నేత‌లు బాధ‌తో కేక‌లు వేస్తున్నా కూడా పోలీసులు క‌నిక‌రించ‌లేదు. ఈడ్చుకుంటూ వెళ్లిన నేత‌ల‌ను పోలీసులు ఎత్తి వ్యాన్ల‌లో వేసేశారు. అంతేకాకుండా... నేత‌ల‌పై ఎంత క‌సి ఉందో తెలియ‌దు గానీ... నేత‌ల‌ను ఎత్తుకుని బ‌య‌లుదేరుతున్న వ్యాన్ల‌ను స‌డెన్ బ్రేకులు వేశారు. ఆ స‌డెన్ కుదుపుల‌కు వ్యాన్ల‌లో ఉన్న వైసీపీ నేత‌లు వ్యాన్ నుంచి కింద‌ప‌డిపోయారు. దీంతో వైసీపీ నేత‌లు మ‌ల్లాది విష్ణు - సామినేని ఉద‌య‌బాను - జోగి ర‌మేశ్‌ - పైలా సోమినాయుడుల‌కు గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై ఉద్య‌మ‌కారులంతా షాక్‌ కు గురి కాగా... పోలీసులు మాత్రం ఇదంతా కామ‌నేనంటూ నేత‌ల‌ను స్టేష‌న్ల‌కు త‌రలించేశారు.