Begin typing your search above and press return to search.

ఇంతకీ ఏపీలో సైకిల్ ఎక్కేది ఎంతమంది?

By:  Tupaki Desk   |   21 Feb 2016 11:30 AM GMT
ఇంతకీ ఏపీలో సైకిల్ ఎక్కేది ఎంతమంది?
X
ఏపీలో జగన్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్నటి వరకూ కడప జిల్లాకు చెందిన జగన్ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సైకిల్ ఎక్కుతున్నారన్న వార్తలు మీడియాలో బలంగా వినిపిస్తే.. రెండు రోజులుగా కర్నూలు జిల్లాకు చెందిన భూమా ఎపిసోడ్ నడుస్తోంది. మరోవైపు.. పలు జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏపీ అధికారపక్షం వెంట నడవనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తనకు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని.. తాను కానీ ఆ లిస్ట్ చెప్పటం మొదలుపెడితే.. గంటలోపు బాబు సర్కారు కూలిపోతుందని జగన్ వ్యాఖ్యానిస్తున్నారు. ఓపక్క పార్టీ నేతలు జంప్ అయ్యేందుకు రెఢీ అవుతున్న వార్తలు జోరుగా వస్తుంటే.. మరోవైపు జగన్ అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఇంతకీ ఈ రెండింటిలో ఏది నిజం అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక.. రెండు అంశాల్ని వాస్తవ కోణంలో చూస్తే.. ఒక్క విషయం స్పష్టం కాక మానదు. జగన్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కటం ఖాయమని తెలుస్తోంది.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. జగన్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే డజన్ మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశం ఉందన్న మాట వినపడుతోంది. అప్పుడొకళ్లు.. అప్పుడొకళ్లు కాకుండా.. ఒకేసారి అందరూ మారిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. పరిస్థితులకు తగ్గట్లుగా అయితే ఒకేసారి.. లేకుండా విడతల వారీగా (జిల్లాల వారీగా) జంపింగ్స్ ఉండే వీలుందని చెబుతున్నారు.

ఇక.. పార్టీ మారే ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది టీడీపీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినోళ్లే అన్న మాట వినిపిస్తోంది. భూమా ఎపిసోడ్ లో తనతో భేటీ అయిన కర్నూలు జిల్లా తమ్ముళ్లను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ‘‘మీ అందరి కంటే భూమా ఎలాంటి వాడన్నది నాకు తెలుసు. ఆయన సంగతి నేను చూసుకుంటాను. ఆయన విషయాన్ని నాకు వదిలేయండి’’ అన్న రీతిలో చెప్పటం గమనార్హం.

నిజమే.. భూమాతో చంద్రబాబుకు ఉన్న అనుబంధం అంత చిన్నదేం కాదు. విపక్షంలో ఉన్నప్పుడు.. అవకాశాలు రాక.. భవిష్యత్తులో వస్తాయో లేదో తెలీని సందిగ్థంతో వెళ్లిపోయిన విషయాన్ని మర్చిపోకూడదు. నిజానికి భూమా అవసరాలు బాబు కంటే బాగా తెలిసిన వారు మరెవరూ ఉండరేమో. అప్పట్లో ఆయన అవసరాల్ని తీర్చలేని స్థితిలో బాబు ఉంటే.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. అందుకే.. భూమా ఇష్యూను తనకు వదిలేయాలని బాబు అంత కాన్ఫిడెంట్ గా చెప్పారని చెప్పొచ్చు.

తాజా పరిణామాల నేపథ్యంలో మరో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు బాబు జట్టులో చేరేది ఎప్పుడు? అన్నది. ఈ విషయం మీదా భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వారం.. పది రోజుల్లోనేనని కొందరు చెబుతుంటే.. వెను వెంటనే కాకున్నా.. నెలా.. రెండు నెలల మధ్యలో జంపింగ్స్ ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుందని చెబుతున్నారు. నాలుగు రోజులు అటూఇటూ అయినా.. ఏపీలో జంపింగ్స్ మాత్రం పక్కా అని రాజకీయ వర్గాలు చెబుతుండటం గమనార్హం.