Begin typing your search above and press return to search.

వైసీపీ కొత్త రకం పోరాటం

By:  Tupaki Desk   |   10 April 2015 12:30 AM GMT
వైసీపీ కొత్త రకం పోరాటం
X
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కొత్తరకం ఉద్యమాలకు తెరతీస్తోంది. ఏపీలో ప్రధానప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో ఆ మేరకు పూర్తి స్థాయిలో దూకుడుగా వ్యవహరించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకోవడమే కాకుండా తదనుగుణంగా వ్యవహరిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు రాజధాని భూసమీకరణే మార్గమని ఆ పార్టీ భావించింది. అయితే ప్రత్యక్ష పోరాటాలతో పాటు సామాజిక వేత్తల అండగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. తద్వారా తమ విమర్శలు రాజకీయ పరమైనవే అనే విమర్శను వదిలించుకోవడంతో పాటు... సమస్య తీవ్రతను జాతీయ స్థాయికి తీసుకువెళ్లే దిశగా కసరత్తు చేస్తోంది.

తాజాగా ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్‌ గురువారం ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా నిర్మించ తలపెట్టిన రాజధాని ప్రాంతాన్నిసందర్శించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి మనోభావాలు తెలుసుకున్నారు. ప్రజాభిప్రాయన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములను లాక్కుందని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ల్యాండ్‌ పూలింగ్‌ కాదన్నారు.ఎపి సీఎం చంద్రబాబు చేస్తున్న భూ సమీకరణ ఒకరకమైన దోపిడి లాంటిదని మండిపడ్డారు. దళితులకు తమ భూములను ఇవ్వడానికి ఇష్టపడటం లేదని మేధా పాట్కర్‌ తెలిపారు.తుళ్లూరు మండలంలోని మూడు పంటలు పండే భూములను సీఆర్‌డీఏ చట్టం కింద తీసుకోవడం ఏమిటని ఆమె ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటివరకు భూములు ఇచ్చిన వారు కూడా తమకు ఇష్టం లేకపోతే అభ్యంతర పత్రం దాఖలు చేసుకునే అవకాశం ఉందని ఆమె స్థానికులతో అన్నారు. అహ్లాదకరమైన వాతావరణాన్ని ధ్వంసం చేసి రాజధానిని నిర్మించడం సరికాదన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఎంతో మంది రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

అయితే ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు మంగళగిరికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీడీపీకి చెందిన వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డె శోభనాధ్రీశ్వరరావు తదితరులు ఉన్నారు.

సామాజిక ఉద్యమకారణి అయిన మేధాపాట్కర్‌ పర్యటన రైతుల పక్షంలో ఉంటుంది. దీనిపై ఎవరికీ అభ్యంతరం లేదు. అయినా..వారివెంట వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉండటం ఇక్కడి ఆసక్తికరం. ఒకవేళ స్థానిక ఎమ్మెల్యే అన్న కోణంలో రామకృష్ణారెడ్డి వెళ్లారు అని అనుకున్నా.. గతంలో వైసీపీ గతంలో చెప్పిన విషయాలను గుర్తుచేసుకోవాలి. రాజధాని భూ సేకరణ కోసం జాతీయ నేతలను ఆహ్వానిస్తామని ఆ పార్టీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఒత్తిడి చంద్రబాబుపై ఏవిధంగా పనిచేస్తుందో చూడాలి మరి.