Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు వైఎస్ఆర్సీపీ లాజిక‌ల్ ప్ర‌శ్న‌!

By:  Tupaki Desk   |   13 March 2020 2:30 AM GMT
చంద్ర‌బాబుకు వైఎస్ఆర్సీపీ లాజిక‌ల్ ప్ర‌శ్న‌!
X
స్థానిక ఎన్నిక‌లు జరుగుతున్న తీరుపై తెలుగుదేశం అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు ఈ మ‌ధ్య కాలంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ మీదే విమ‌ర్శ‌లు చేస్తూ ఉన్నారు. గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాగానే.. ఆ ఎన్నిక‌ల తీరుపై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు. అంత‌క‌న్నా మునుపే.. ఈవీఎంల మీద ఎన్నిక‌లు వ‌ద్ద‌న్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను తొలి విడ‌త‌లోనే నిర్వ‌హించ‌డం మీద కూడా చంద్ర‌బాబు అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు చేశారు. కుట్ర‌తోనే ఏపీలో తొలి విడ‌తలోనే ఎన్నిక‌లు జ‌రుపుతున్నారంటూ అప్ప‌ట్లో చంద్ర‌బాబు కేంద్రాన్ని, ఈసీని విమ‌ర్శించారు.

ఇక స్థానిక ఎన్నిక‌లు జ‌రుగుతున్న తీరు మీద కూడా చంద్ర‌బాబు నాయుడు తీవ్రంగా విరుచుకుప‌డుతూ ఉన్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ మీద విరుచుకుపడుతున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ రాగానే చంద్ర‌బాబు నాయుడు ఈసీని, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను విమ‌ర్శించ‌డం మొద‌లుపెట్టారు. ఈసీపై కోర్టుకు వెళ్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఆ పిటిష‌న్లు ఏమ‌య్యాయో కానీ.. త‌మ పార్టీ వారి చేత నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌నివ్వ‌డం లేదంటూ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వంపై ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఎంపీటీసీ, జ‌డ్పీ ఎన్నిక‌ల నామినేష‌న్ల గ‌డువును కూడా పొడించాల‌ని కూడా చంద్ర‌బాబు నాయుడు డిమాండ్ చేశారు.

అయితే చంద్ర‌బాబు నాయుడును లాజిక్ తో కొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయ‌న చెబుతున్న‌ది అబ‌ద్ధ‌మ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. అందుకు రుజువుల‌ను కూడా వారు ప్ర‌స్తావిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

స్థానిక ఎన్నిక‌ల్లో భాగంగా ఎంపీటీసీ స్థానాల‌కు దాఖ‌లు అయిన నామినేష‌న్ల నంబ‌ర్ల‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప్ర‌స్తావిస్తూ ఉన్నారు. మొత్తం 9,696 ఎంపీటీసీ స్థానాల‌కూ గానూ.. టోట‌ల్ గా యాభై వేల‌కు పైగా నామినేష‌న్లు దాఖ‌లు అయిన విష‌యాన్ని వైసీపీ ప్ర‌స్తావిస్తూ ఉంది. ఈసీ విడుద‌ల చేసిన గ‌ణాంకాల‌ను ప్ర‌స్తావిస్తోంది. ఆ నామినేష‌న్ల‌లో త‌మ పార్టీ త‌ర‌ఫున 23 వేల నామినేష‌న్లు, తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున 18 వేల నామినేష‌న్లు దాఖ‌లు అయిన‌ట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు చెప్పారు.

తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున 18 వేల నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయ‌నే విష‌యాన్ని నొక్కి చెబుతూ ఉన్నారు అధికార పార్టీ నేత‌లు. టీడీపీ త‌ర‌ఫున అన్ని నామినేష‌న్లు దాఖ‌లు అయిన నేప‌థ్యం లో.. టీడీపీ వాళ్ల‌ను నామినేషన్లు వేయ‌కుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డ అడ్డుకున్న‌ట్టు? అని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తూ ఉన్నారు!

నామినేషన్ల‌ను దాఖ‌లు చేయ‌నీయ‌కుండా త‌మ వారిని అడ్డుకుంటున్నార‌ని చంద్ర‌బాబు నాయుడు ఆరోపించిన నేప‌థ్యంలో.. 18 వేల నామినేష‌న్ల‌ను ఎవ‌రు దాఖ‌లు చేసిన‌ట్టు? అంటూ వైసీపీ నేత‌లు లాజిక‌ల్ కొశ్చ‌న్ వేశారు. మ‌రి దీనికి తెలుగుదేశం ఏమంటుందో!