Begin typing your search above and press return to search.

మంత్రి సీదిరి స‌ర్దు కావాల్సిందేనా..!

By:  Tupaki Desk   |   29 Nov 2022 5:21 AM GMT
మంత్రి సీదిరి స‌ర్దు కావాల్సిందేనా..!
X
శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, మంత్రి డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు ప‌రిస్థితి క‌త్తిమీద సాములా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న‌పై వైసీపీ సొంత నేత‌లే విరుచుకుప‌డ‌డం, టికెట్ ఇస్తే ఓడిస్తామని గంభీర ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం.. ఇవి మీడియాలోనూ ప్ర‌చారం జ‌ర‌గ‌డం.. వంటివి సీదిరికి ప్రాణ‌సంక‌టంగా మారింది. వైసీపీ జిల్లా కార్యదర్శి దువ్వాడ హేమబాబు చౌదరికి.. మంత్రికి కొన్నాళ్లుగా అస్స‌లు ప‌డ‌డం లేదు.

దీంతో ఆయ‌న నాయ‌క‌త్వంలో దాదాపు 300 మంది నియోజ‌క‌వ‌ర్గం స్థాయి నాయ‌కులు.. సీదిరిపై నిప్పులు చెరుగుతున్నారు. పలాస నియోజకవర్గంలో మంత్రి అండదండలతో కొంద‌రు దోచుకుంటున్నార‌ని కూడా వారు ఆరోపిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము సీదిరి అన్నం పెడితే.. మాకు సున్నం కొడుతు న్నాడంటూ.. వారు ఆగ్ర‌హం చేస్తున్నారు. తాజాగా ఆదివారం నిర్వ‌హించిన వ‌న భోజ‌నాల కార్య‌క్ర‌మంలో ఇదే విష‌యంపై చ‌ర్చించ‌డం గ‌మ‌నార్హం.

'పంచాయతీ ఎన్నికల నాటి నుంచి ప్రతి గ్రామంలో వైసీపీలోనే రెండువర్గాలుగా విడగొట్టి శకుని రాజకీయాలకు పాల్పడుతున్నారు. రానున్న ఎన్ని కల్లో సీదిరి అభ్యర్థిగా దిగితే వైసీపీ నుంచి 175 స్థానాలకు గాను 174 స్థానాలే లెక్కించాలి'' అని నాయ‌కులు హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. నియోజకవర్గం లో అత్యధిక ఓటర్లుగా ఉన్న‌ అగ్నికుల క్షత్రియ, యాదవ, కాళింగ సామాజిక వర్గాల నుంచి అభ్యర్థిని ప్రకటించాలని వారు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్యర్థిని మార్చకపోతే పలాసలో వైసీపీకి వ్య‌తిర‌కంగా ప‌నిచేస్తామ‌ని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, సీదిరికి టికెట్ ఇస్తే.. పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుంద‌ని అన‌డం.. సంచ‌ల‌నంగా మారింది. 'ప్రతి పనికి ఒక రేటులా మంత్రి కోటరీ మారింది' అని విమర్శించడం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో మంత్రి సీదిరిని త‌ప్పిస్తారా.. లేక వేరే నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ కేటాయిస్తారా? ఇవ‌న్నీ కాకుండా.. సీఎం జ‌గ‌న్ ఇలా ఆరోప‌ణ‌లు చేసిన వారిపైనే చ‌ర్య‌లు తీసుకుంటారా? సీదిరిని సేఫ్ చేస్తారా? అనేది చూడాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.