Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేకు సెగ బాగానే త‌గులుతోందే!!

By:  Tupaki Desk   |   31 July 2022 7:30 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేకు సెగ బాగానే త‌గులుతోందే!!
X
రాజ‌కీయాలంటే.. అంతో ఇంతో తెగువ ఉండాలి. అంత‌కు మించిన ధైర్యం ఉండాలి. అయితే.. ఈ రెండు కొర‌వ‌డిన‌ప్పుడే.. నాయ కులు న‌లిగిపోతుంటారు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితిని.. వైసీపీసీనియ‌ర్ నాయ‌కుడు.. రాజ‌కీయంగా ఉద్ధండుడ‌నే పేరున్న‌.. మాజీ మంత్రి.. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ అంటూ.. ఆయ‌న‌కు ఇప్పుడు ఏదీ క‌నిపించ‌డం లేదు. అన్నీ.. అవ‌స‌రంకోసం.. వేసుకున్న బంధంతో కొన‌సాగే.. పార్టీలుగానే క‌నిపిస్తున్నాయ‌ట‌! ఈ మాట నెల్లూరు జిల్లాలో జోరుగా వినిపిస్తున్న మాట‌. కాంగ్రెస్‌ను సొంత పార్టీగా భావించిన ఈ కుటుంబం.. మంత్రి ప‌ద‌వులు.. అనుభ‌వించింది.

నెల్లూరును ఒక ద‌శాబ్దంపాటు .. త‌మ క‌నుసైగ‌ల్లో.. ఆనం కుటుంబం న‌డ‌ప‌గ‌లిగింద‌ని అంటారు. అయితే.. ఇప్పుడు ఆప రిస్థితి లేదు. ఇక‌పై వ‌స్తుందా? అంటే.. రాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఆనంకు వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. ఆత్మ‌కూరు కాదు.. వేరే నియోజ‌క‌వ‌ర్గం ఇస్తామ‌న్నారు. కాదు.. నాకు ఆత్మ‌కూరు కావాల్సిందే.. అను ప‌ట్టుబ‌ట్టారు. ఇంత‌లోనే 2014 ఎన్నిక‌లు వ‌చ్చేశాయి. దీంతో ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నారు. త‌ర్వాత‌.. తీరిక‌గా.. టీడీపీలోకి చేరారు. ఇక‌, ఇక్క‌డ ఆయన కోరుకున్న ప‌ద‌వి ద‌క్క‌లేదు.

క‌నీస గుర్తింపు కూడాలేద‌ని.. భావించి.. వెంట‌నే ఎన్నిక‌ల‌కు ముందు.. ఏరికోరి వైసీపీలోకి వచ్చారు. 2014లో ఏదైతే.. వైసీపీ చెప్పిందో.. అలానే 2019లోనూ జ‌రిగింది. ఆత్మ‌కూరు పీఠం అయితే.. ద‌క్క‌లేదు. అయిష్టంగానే వెంక‌ట‌గిరి నుంచి పోటీ చేసిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి.. జ‌గ‌న్ సునామీలో కొట్టుకుని విజ‌యం సాధించారు. అయితే.. ఇక్క‌డ కూడా సేమ్ సీన్‌. త‌న‌కు గుర్తింపు లేదు.. ``నేను సీనియ‌ర్‌ను అయినా.. ఎవ‌రు ప‌ట్టించుకుంటున్నారు. ఒక స‌ల‌హా ఇవ్వాల‌న్నా.. తీసుకునేవారు లేరు. ఒక మాట చెబుదామ‌న్నా.. ప‌ట్టించుకునేవారు లేరు`` ఇదీ.. ఆయ‌న ఆవేద‌న‌.

పైగా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు అభివృద్ధి కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో ఆయ‌న వైసీపీని వీడి మ‌ళ్లీ టీడీపీలోకి వెళ్లిపోవా ల‌నే ప్లాన్ లో ఉన్నార‌నేది నెల్లూరు టాక్‌. దీనిపై గ‌త ఆరు మాసాల నుంచి గుస‌గుస వినిపిస్తోంది. వివేకా కుమారుడు.. టీడీపీలో కి వెళ్లాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇది స‌క్సెస్ అయితే.. తాను కూడా అదే పార్టీలోకి తిరిగి చేరాల‌ని ఆనం అనుకుంటున్న‌ట్టు ఆయ‌న అనుచ‌రులే చెబుతున్నారు.

అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ అదే ధ‌ర్మ సంక‌టం.. `గుర్తింపు` ఉంటుందా? అనే!! కానీ.. దీనిపీ టీడీపీ నేత‌ల నుంచి ఎలాంటి హామీ ల‌భించ‌డం లేదు. ఎందుకంటే.. ఇప్ప‌టికే చాలా మంది సీనియ‌ర్లు ఉన్నారు. సో.. వారిని కాద‌ని.. ఆనంకు గుర్తింపు ఇచ్చే ప‌రిస్థితి చంద్ర‌బాబుచేయ‌రు. సో.. దీంతో ఇటు వైసీపీలో ఉండ‌లేక‌.. అటు టీడీపీలోకి వెళ్ల‌లేక‌.. ఈయ‌న స‌త‌మ‌తం అవుతున్నార‌ట‌. మ‌రి ఎన్నిక‌ల స‌మయానికి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.