Begin typing your search above and press return to search.

కానిస్టేబుల్ కొడుకా.. చిరంజీవి తమ్ముడు కాదా.?

By:  Tupaki Desk   |   30 Nov 2018 11:28 AM GMT
కానిస్టేబుల్ కొడుకా.. చిరంజీవి తమ్ముడు కాదా.?
X
పవన్ కళ్యాణ్ ఓట్ల రాజకీయాన్ని వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కడిగిపారేశారు. శుక్రవారం కాకినాడలో జరిగిన ‘వంచనపై గర్జన దీక్ష’లో ఆయన పవన్ వైఖరిపై నిప్పులు చెరిగారు. ఓట్ల కోసమే తాను కానిస్టేబుల్ కుమారుడిని అని చెప్పుకుంటున్న పవన్ .. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిని అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాడని ఆయన విమర్శించారు. కానిస్టేబుల్ కొడుకే అంటే ఓట్లు పడుతాయని ఆలోచిస్తున్నావా అని విమర్శించారు. చిరంజీవి పేరు చెప్పుకోలేని పవన్ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.

కుల రాజకీయాలకు దూరం అనే పవనే.. ప్రతి సభలోనూ కులాన్ని ప్రస్తావిస్తాడని.. ఇలా కులం వెంటపడే నాయకుడు ఏపీలో పవన్ మాత్రమేనని ఎమ్మెల్యే అనిల్ కుమార్ విమర్శించారు. పవన్ కళ్యాన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నటిస్తున్నాడని మండిపడ్డారు.

జగన్ ను దెబ్బతీయడమే అజెండాగా టీడీపీ - కాంగ్రెస్ - జనసేన కలిసి పనిచేస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే తమ పప్పులు ఉడకవని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారని ఆరోపించారు.

జగన్ పై దాడిని కోడికత్తి అంటూ పవన్ ఎద్దేవా చేశారని అనిల్ మండిపడ్డారు. అదే కోడికత్తితో దాడి చేస్తే పవన్ తట్టుకుంటారా.? అని ప్రశ్నించారు. దాడి జరిగినా జగన్ ఎలాంటి రచ్చ చేయకుండా హుందాగా అక్కడి నుంచి వెళ్లిపోయారని అనిల్ కుమార్ చెప్పారు. పవన్ అయ్యి ఉంటే నన్ను పొడిచేశారంటూ పెద్ద రచ్చ చేసేవాడు అంటూ ఎద్దేవా చేశారు.

ఇక చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగాయని వైసీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. వైఎస్ హయాంలోనే దళితులకు న్యాయం జరిగిందని.. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామన్న చంద్రబాబు హామీ మరిచిపోయాడని ధ్వజమెత్తారు.

చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో అందినకాడికి దోచుకున్నాడని వైసీపీ నేత జక్కంపూడి రాజా ఆరోపించారు. వేల ఉద్యోగాలు పీకేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి అందరి ఉద్యోగాలు పీకేయించారని మండిపడ్డారు. లోకేష్ కు మాత్రం జాబు ఇప్పించారని తీవ్రంగా ధ్వజమెత్తారు.