Begin typing your search above and press return to search.

అనిల్ స్పీక్స్ : జ‌గ‌నన్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   20 April 2022 11:30 PM GMT
అనిల్ స్పీక్స్  : జ‌గ‌నన్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ ఎవ‌రో తెలుసా?
X
క్యాబినెట్ విస్త‌ర‌ణ లేదా  పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ ప్ర‌క్రియ పూర్తై వారం రోజులు దాటి పోయినా కూడా ఇంకా అదే విష‌యమై పాపం పాత మంత్రులు మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డుతూనే ఉన్నారు. తాము జ‌గ‌నన్న సైనికులం అని, త‌మ‌కు  జ‌గ‌న్ ఓ బంగారు కొండ అని తామంతా ఆయ‌న‌కు ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటామ‌ని క‌విత్వ భాష‌లో కూడా కొన్ని మాట‌లు చెబుతున్నారు. సినిమా హీరోల మ్యాన‌రిజాన్ని ఫాలో చేస్తూ చెబుతున్నారు నెల్లూరు అనిల్.

ఇంకా చెప్పాలంటే ఆయ‌న చెప్పిన మాట‌ల ప్రకారం తామంతా జ‌గ‌నన్న ఫొటోతోనే గెలిచామ‌ని, వ్య‌క్తిగ‌త ఇమేజ్ తో గెలిచిన వాళ్లు ఈ రాష్ట్రంలో త‌న‌కు తెలిసి ఓ ప‌దిశాతం మంది ఎమ్మెల్యేలు ఉంటార‌ని మ‌రో ఆస‌క్తిదాయ‌క విషయం వెల్ల‌డించి విస్మ‌య‌ప‌రిచారు. క‌నుక ఆ రోజు వైఎస్ బొమ్మ పెట్టుకుని జ‌గన్ ఉప ఎన్నిక‌ల్లో గెలిచాడు అని విప‌క్షాలు అన్నాయి.. ఇప్పుడు తామంతా జ‌గ‌న్ బొమ్మ పెట్టుకుని గెలిచామ‌ని అనిల్ అంటున్నాడు. అంటే ఇదంతా ఓ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీలో భాగంగా ఎవ్వ‌రైనా అనిపిస్తున్నారా లేకా వీరే అంటున్నారా?

ఇక అస‌లు విష‌యానికే వ‌స్తే.. క‌రోనా కాలంలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ గురించి విన్నాం.. ఇప్పుడు క‌ష్ట కాలంలో ఫ్రంట్ లైన్  వారియ‌ర్స్ ఎవ‌రు అంటే తామే అని అనిల్ అంటున్నారు. జ‌గ‌నన్న‌కు తాను భారం కాను అని కూడా అంటున్నారు. ఆ విధంగా మ‌రోమారు ప్ర‌భుభ‌క్తి చాటుకుంటున్నారు. తొల‌గించిన 14 మంది మ‌ళ్లీ మంత్రులు కావ‌డం ఖాయం అని కూడా చెబుతున్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఆస‌క్తిదాయ‌క విష‌యాలు వెల్ల‌డించి, కొన్నింటిని క్లారిఫై చేసి వెళ్లారు.

జ‌గ‌న్ అనే అధినేత ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తాన‌ని, రెండు జిల్లాల‌కే త‌న‌ను ప‌రిమితం చేసి బాధ్య‌త‌లు అప్ప‌గించారు క‌నుక వాటి విష‌య‌మై తాను మ‌రింత స‌మర్థంగా ప‌నిచేస్తాన‌ని అన్నారు. త‌న‌కు ఏ బాధ్య‌త అప్ప‌గించినా నిర్వ‌ర్తించేందుకు సుముఖంగానే ఉన్నాన‌ని పున‌రుద్ఘాటించారు. ఆ విధంగా మ‌రోసారి స్వామి భ‌క్తిని నిరూపించుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశారు.