Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే గానం.. మేయర్, కమిషనర్ కోరస్
By: Tupaki Desk | 12 Dec 2021 3:30 PM GMTఏపీలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి జాతీయ స్థాయి ఆహ్వానిత కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలకు సన్నహాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. అంతేకాక టోర్నీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్. కబడ్డీ పోటీలకు మరింత ప్రచారాన్ని తీసుకొచ్చే క్రమంలో సింగర్ గా మారారు. టోర్నీ ప్రచారం కోసం. ప్రత్యేకంగా పాటను రూపొందిస్తున్నారు. "తెగువకు తెగువకు రణ రణ సమరం...అంటూ సాగే ఓ పాటలో... లే...పంగా...కబడ్డీ కబడ్డీ కబడ్డీ.. ఖేలో కబడ్డీ, ఖేలో కబడ్డీ"అంటూ భూమన కరుణాకర రెడ్డి బృంద గానం చేశారు. నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ పీఎస్ గిరీషా దీనికి గొంతు కలపడం విశేషం. తిరుపతిలోని లూప్స్ స్థూడియోలో ఈ మేరకు రికార్డింగ్ కూడా దాదాపు పూర్తైంది. ఈ ప్రమోషనల్ సాంగ్ ను సీడీ ల రూపంలో తీసుకొచ్చి ప్రచారం కల్పించనున్నారు. త్వరలో ప్రో కబడ్డీ టోర్నీ ప్రారంభంకానున్నందున.. తిరుపతిలో నేషనల్ కబడ్డీ టోర్నీ సందడి నెలకొంది. టోర్నీకి ప్రో కబడ్డీ రేంజ్ లో ప్రచారం కల్పించి విజయవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ తో పాటపాడించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే రికార్డింగ్ స్టూడియోలో పాటపాడుతున్న విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మరోవైపు ఎమ్మెల్యే భూమన గాన ప్రతిభ ఇలా వెలుగులోకి వచ్చిందని అభిమానులు బర పడుతున్నారు. భూమన తొలుత వామపక్ష వాది. తర్వాత వైఎస్ రాజారెడ్డికి సన్నిహితులై వారి కుటుంబానికి చేరువయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రధాన అనుచరుల్లో ఆయన ఒకరు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ నుంచి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు.