Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్.. రాత్రంతా నరకం

By:  Tupaki Desk   |   25 Feb 2019 7:16 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్.. రాత్రంతా నరకం
X
వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటర్ల సర్వే పేరుతో వచ్చిన కొందరు యువకులను ఎమ్మెల్యే అడ్డుకున్నారని వారి ఫిర్యాదు మేరకు అధికార పార్టీ ప్రోద్బలంతో పోలీసులు రెచ్చిపోయారు. సర్వేల పేరుతో వచ్చిన యువకులు.. వైసీపీ సానుభూతి పరులను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ చెవిరెడ్డి, ఆయన అనుచరులు ధర్నా చేపట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారిని అరెస్ట్ చేశారు.

అయితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు చెవిరెడ్డిని హింసించారు. రాత్రంతా జీపులో ఎక్కించుకొని పలుగ్రామాల్లో తిప్పారు. చంద్రగిరి నియోజకవర్గానికి దూరంగా తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న సత్యవేడు పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్బంధించారు.

దీనిపై చెవిరెడ్డి ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందనే భయంతోనే టీడీపీ తనను టార్గెట్ చేసిందని మండిపడ్డారు. టీడీపీ, పోలీసుల వైఖరిపై తాను ఈసీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

చంద్రగిరి అసెంబ్లీలో చెవిరెడ్డిని ఓడించాలని కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు ప్లాన్ చేశారు. వైసీపీలో బలమైన నేతగా.. చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారిన చెవిరెడ్డిని ఓడించాలని ఆయన అనుకూలుర ఓట్లు తొలగించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్న విమర్శలున్నాయి.. చంద్రగిరి మొదటి నుంచి కాంగ్రెస్ కు, ఆ తర్వాత వైసీపీకి పెట్టని కోటగా మారింది. 1994లో చివరిసారిగా టీడీపీ గెలిచింది. 1999,2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గల్లా అరుణాకుమారి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పట్టు కోల్పోయి వైసీపీకి ఆధిక్యం లభించింది.

మరోసారి సర్వేల్లో చంద్రగిరి నుంచి వైసీపీ తరుఫున చెవిరెడ్డి గెలుపు ఖాయమని తేలిందట.. అందుకే వైసీపీకి గట్టి పట్టు ఉన్న మండలాల్లో వైసీపీ సానుభూతిపరుల పేర్లను తొలగించే కార్యక్రమానికి టీడీపీ పాల్పడుతుందనే విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే 14వేల ఓట్లను తొలగించినట్టు వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా యువకులతో దొంగ సర్వేలంటూ టీడీపీ ఓట్లను తొలగిస్తోందన్న ఆరోపణలున్నాయి. తాజాగా చంద్రగిరిలోని పాకాల మండలంలో సర్వేను చెవిరెడ్డి అడ్డుకోవడంతో ఈ విషయం వెలుగుచూసింది.