Begin typing your search above and press return to search.

ఓట‌మి భ‌యంతోనే టీడీపీ చిల్లర రాజకీయం

By:  Tupaki Desk   |   16 Oct 2018 2:09 PM GMT
ఓట‌మి భ‌యంతోనే టీడీపీ చిల్లర రాజకీయం
X
ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ఫ్యాన్ గాలి గ‌ట్టిగా వీస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఉన్న ప‌ళంగా ఏపీలో ఎన్నికలు వ‌స్తే అధికార టీడీపీ క‌న్నా వైసీపీకి 10 శాతానికి పైగా ఓట్లు అధికంగా వ‌స్తాయ‌ని జాతీయ మీడియా స‌ర్వేలు కూడా బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నాయి. రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంద‌ని, జ‌గ‌న్ సీఎం కాబోతున్నార‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార టీడీపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే, ఓట‌ర్ల జాబితా నుంచి వైసీపీ మ‌ద్ద‌తుదారుల ఓట్ల‌ను తొల‌గించేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ తొలగింపుల‌పై నరసరావుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. మ‌రోసారి అధికారం చేప‌ట్టేందుకు ప్ర‌భుత్వం చిల్లర రాజకీయం చేస్తోందని మండిప‌డ్డారు.

అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా టీడీపీ నాయకులు ఓట్ల తొల‌గింపు వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ నియోజక వర్గంనుంచి 5 వేల వైసీపీ మ‌ద్ద‌తుదారుల ఓట్ల‌ను తొలగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆ తొల‌గింపు కార్య‌క్ర‌మం కోస‌మే `నగర దీపికలు` పేరుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను టీడీపీ ఏర్పాటు చేసిందని మండిప‌డ్డారు. బతికున్నవాళ్లను చనిపోయినట్లుగా, ఊళ్లో ఉంటున్న వారు వలస పోయినట్లుగా చూపించి ఓట్లు తొలగిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. ఎన్నికల‌ను న్యాయ‌బ‌ద్ధంగా ఎదుర్కొనే ధైర్యం లేకే ఈ ర‌కంగా అడ్డ‌దారులు తొక్కుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఓట్ల తొల‌గింపు వ్య‌వ‌హారంపై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశామ‌న్నారు. త‌మ‌కు న్యాయం జరగని ప‌క్షంలో కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ నేప‌థ్యంలో ఓటరు జాబితాలో తమ ఓటు ఉందో లేదో తెలుసుకోవాలని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల‌కు శ్రీ‌నివాస రెడ్డి సూచించారు. త‌మ ఓటు గ‌ల్లంతైతే ....దానికి గ‌ల కార‌ణాల‌ను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాల‌ని తెలిపారు.