Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేనే ఓడిస్తామంటున్న సొంత క్యాడర్... ?

By:  Tupaki Desk   |   12 March 2022 7:00 AM IST
వైసీపీ ఎమ్మెల్యేనే ఓడిస్తామంటున్న సొంత క్యాడర్... ?
X
ఆయన వైసీపీ ఎమ్మెల్యే. రాజకీయ కుటుంబానికి చెందిన కీలక నేత. అలుపెరగక రెండు సార్లు వరసబెట్టి పోటీ చేస్తే జగన్ వేవ్ లో 2019లో ఎట్టకేలకు ఎమ్మెల్యే కాగలికారు. ఆయన ఎవరో కాదు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఆయన తండ్రి గొర్లె హరిబాబు కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నేత. కాంగ్రెస్ తో మూడు దశాబ్దాల బంధం. వైఎస్సార్ తో దోస్తీ. అన్నీ కలసినా కూడా ఆయన ఏనాడూ ఎమ్మెల్యే కాలేకపోయారు.

ఆయన రాజకీయ వారసుడిగా ముందుకు వచ్చిన కిరణ్ కుమార్ 2014 ఎన్నికలో ఎచ్చెర్ల నుంచి పోటీ చేసి కిమిడి కళా వెంకటరావు చేతిలో నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక 2019 నాటికి అదే కళాను 18 వేల పై చిలుకు మెజారిటీతో ఓడించి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యారు. తన తండ్రికి తనకూ కలగా మారిన ఎమ్మెల్యే పదవిని చేపట్టిన కిరణ్ దాన్ని నిలుపుకోవడంలో మాత్రం పూర్తిగా తడబడుతున్నారనే చెప్పాలి.

శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తోంది. పారిశ్రామిక వాడగా ఉంది. అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ తో పాటు ఇతర‌ వ్యాపారాలకు కూడా కేంద్ర బిందువుగా ఉంది. అలాంటి చోట ఎమ్మెల్యే అయిన కిరణ్ పార్టీని, తనను గెలిపించిన వారినీ పక్కన పెట్టేసి ఇతర పార్టీల వారినే అందలం ఎక్కిస్తునారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటున్నారని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

తాజాగా వారంతా మీటింగు పెట్టుకుని మరీ కిరణ్ మీద అసమ్మతి వెళ్లగక్కారు. ఆయన వైసీపీ వ్యతిరేకులతో చేతులు కలిపి పార్టీ వారిని సైడ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏకపక్షంగా ముందుకు సాగుతూ సొంత పార్టీని ఇబ్బంది పెడుతున్నారని కూడా గుస్సా అయ్యారు. కిరణ్ కి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇస్తే మాత్రం తామే దగ్గరుండి మరీ ఓడిస్తామని కూడా అసమ్మతి నేతలు సనపల నారాయణరావు, లుకలాపు అప్పలనాయుడు తదితరులు భీషణ ప్రతిన చేశారు.

తమకు పార్టీ ఇష్టమే కానీ కిరణ్ తో మాత్రం కష్టమని తేల్చిచెబుతున్నారు. కిరణ్ కుమార్ ని పార్టీ హెచ్చరించి ఈ రెండేళ్ళు అయినా సజావుగా నియోజకవర్గంలో అభివృద్ధి సాగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడితే ఇపుడు చెడ్డ అయిపోయామా అని ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి చూస్తే ఎచ్చెర్ల మరోసారి వైసీపీ ఖాతాలో పడుతుందని ఆశిస్తున్న పార్టీకి ఈ హెచ్చరికలు మింగుడు పడడంలేదు. టీడీపీలో కూడా పార్టీ నేతల మధ్య విభేధాలు ఉన్నాయి. అలాంటి చోట ఇలా వైసీపీ కూడా అలాగే తయారైతే ఇక ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయమని ఆ పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హై కమాండ్ దీని మీద దృష్టి పెట్టాలనే కోరుతున్నారు.