Begin typing your search above and press return to search.

ముస్లింలతో కరోనానా? హఫీజ్ ఆగ్రహం

By:  Tupaki Desk   |   23 April 2020 3:45 AM GMT
ముస్లింలతో కరోనానా? హఫీజ్ ఆగ్రహం
X
కర్నూలులో కరోనా వైరస్ కేసుల తీవ్రత పెరగడానికి కారణం ఎవరు? ఇప్పుడు దీనిచుట్టే అక్కడ రాజకీయం రాజుకుంది. ప్రతిపక్ష టీడీపీ దీనికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వైఖరే కారణమని ఆరోపించాయి. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చారు. టీడీపీని, భూమా అఖిల ప్రియ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఈ సందర్భంగా టీడీపీకి, పచ్చమీడియాకు సవాల్ విసిరారు.. ‘కరోనా వైరస్ విస్తరణలో మేం తప్పు చేసి ఉంటే మా కర్నూలులో రాజధాని సెంటర్ లో ఉరితీయండి.. మేం రెడీ’ అంటూ తొడగొట్టారు. ఈ సందర్భంగా టీడీపీపై విరుచుకుపడ్డారు.

కరోనాను నియంత్రించేందుకు మసీదులను బంద్ చేయించానని.. తబ్లిక్ జమాత్ వెళ్లివచ్చిన వారిని క్వారంటైన్ తరలించానని.. మసీదు పెద్దలకు చెప్పి ప్రార్థనలు ఆపు చేయించి అవగాహన కల్పించానని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు.

కర్నూలు నుంచి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వందమందికిపైగా వెళ్లి వచ్చారని.. దానిని ఒక యాక్సిడెంట్ గా చూడాలని ఎమ్మెల్యే హఫీజ్ అన్నారు. ముస్లిం సమాజం వల్లే కరోనా వ్యాపించిందని రాజకీయంగా వాడుకోవడానికి టీడీపీ ప్రయత్నించడం దుర్మార్గం అని ఆయన కడిగిపారేశారు.

ఈ సందర్భంగా ఆరోపణలు చేస్తున్న భూమా అఖిలప్రియపై మండిపడ్డారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. మీ నాయనా.. మీ అమ్మ ముస్లిం ఓట్లతోనే గెలిచారని.. ఇప్పుడు ముస్లింలకే కరోనా అంటగడుతారా అని ప్రశ్నించారు. రాజకీయాలు, కులాలు, మతాలకు ముడిపెట్టవద్దని హితవు పలికారు. ఇలాంటి కష్టసమయంలో మతం ఆధారంగా కాకుండా మానవత్వంతో ఆలోచించాలని హఫీజ్ హితవు పలికారు.