Begin typing your search above and press return to search.

అనుమానాస్పద రీతిలో వైసీపీ ఎమ్మెల్యే 'కాపు' అల్లుడి మృతి!

By:  Tupaki Desk   |   20 Aug 2022 4:29 AM GMT
అనుమానాస్పద రీతిలో వైసీపీ ఎమ్మెల్యే కాపు అల్లుడి మృతి!
X
ఏపీ ప్రభుత్వ విప్.. అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు 34 ఏళ్ల పప్పిరెడ్డి మంజునాథ రెడ్డి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన వైనం షాకింగ్ గా మారింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ నెంబరు 101లో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం ప్లాట్ కు వచ్చిన ఇతను.. శుక్రవారం సాయంత్రం నిర్జీవంగా పడి ఉన్న విషయాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే..

అతడు పడిపోయి ఉన్న తీరు మాత్రం అతడిది అనుమానాస్పద మృతి అన్నట్లుగా ఉందని చెబుతున్నారు. అప్పుడప్పుడు ప్లాట్ కు వచ్చి.. రెండు మూడు రోజులు ఉండి వెళ్లే అతను.. అదే తీరులో వచ్చాడు. కానీ.. శుక్రవారం సాయంత్రం మాత్రం అతను శవమై కనిపించాడు.

మంజునాథ రెడ్డి తండ్రి వైసీపీ నేత.. పీఎంఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థ యజమాని. కొడుకు మరణించిన వార్త విన్నంతనే ఆయన హుటాహుటిన విజయవాడకు బయలుదేరారు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం జరిగినా.. ఘటనా స్థలంలోని పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఉదంతంపై పోలీసులు సైతం నోరు మెదపకుండా మౌనంగా ఉన్నారు. వారేం మాట్లాడకపోవటంతో మరిన్ని ఊహాగానాలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఇంతకీ.. మంజునాథ రెడ్డి ఎలా చనిపోయారన్న ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. 101 ప్లాట్ బాధ్యతలు చూసే నరేంద్ర రెడ్డి శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ప్లాట్ లోకి వెళ్లాడని.. కాసేపటికే అంబులెన్సు వచ్చినట్లుగా చెబుతున్నారు.

మంజునాథ రెడ్డి పడిపోయి ఉన్నాడని నరేంద్ర రెడ్డి తమకు చెప్పాడని.. దీంతో తామంతా అక్కడకు వెళ్లామని.. అప్పటికే అతను మంచం పక్కనే కింద పడి ఉన్నట్లుగా కనిపించారంటున్నారు. ప్రస్తుతం అతడి మృతదేహం మణిపాల్ ఆసుపత్రిలో ఉంది. ఆయన భార్య స్రవంతి వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా..

మంజునాథ రెడ్డి తండ్రి ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. తాము చేసిన పనులకు పలురాష్ట్రాల నుంచి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని.. రాంకీ నుంచి తమకు బిల్లులు రావాల్సి ఉండగా రాలేదన్నారు. బ్యాంకుల నుంచి ఫైనాన్స్ అందలేకపోవటంతో ఒత్తిడిలో ఉన్నాడని పేర్కొన్నారు. ఈ మరణంపై పోలీసులు వెంటనే రియాక్టు అయితే మంచిదని. లేదంటే అనవసర ప్రచారాలకు తావిచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు.