Begin typing your search above and press return to search.

ఆయన‌ మాజీ అయితే బిగ్ రిలీఫ్...?

By:  Tupaki Desk   |   8 April 2022 1:30 AM GMT
ఆయన‌ మాజీ అయితే బిగ్ రిలీఫ్...?
X
రాజకీయాల్లోనే కాదు జీవితంలో కూడా ఆశలు ఆనందాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మనకు పదవి ఏదైనా దక్కితే ఫుల్ హ్యాపీ. రెండవది మన శతౄవుకు పదవి దక్కకపోతే దానికి రెట్టింపు హ్యాపీ. ఇక ప్రత్యర్ధి పార్టీలలో కొరకరాని కొయ్యలుగా ఉన్న వారి ప్లేస్ తారు మారు అయితే ఆ ఆనందం చెప్పనలవికాదుగా.

ఇపుడు టీడీపీలో అలాంటి చర్చ జరుగుతోందా. అంటే డౌట్లు అయితే ఉన్నాయి. టీడీపీలో పుట్టి అక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలోకి వచ్చిన కొడాలి నాని మంత్రి అయ్యాక ఏకంగా చంద్రబాబుని, చినబాబుని టార్గెట్ చేసుకుని మరీ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఆయన బిగ్ సౌండ్ కి రియాక్ట్ కావడం తప్ప టీడీపీ నుంచి అంతకంటే ఏమీ పెద్దగా లేకుండా పోయింది.

టీడీపీని విమర్శించాలీ అంటే కొడాలి నాని మాత్రమే అన్న పేరు అయితే తెచ్చుకున్నారు. కానీ ఆయన మీద బూతుల మంత్రి అన్న విమర్శలు కూడా అదే టైం లో వచ్చాయి. ఇక పదవి చివరి రోజులకు వచ్చినా చినబాబు మీద చాలెంజి చేసి కొడాలి మళ్లీ వారికి కన్నెర్ర అయ్యారు. ఇంతలా కొడాలి నాని జగన్ క్యాబినేట్లో వెలిగాక తాజాగా మిగిలిన వారితో పాటు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.

మరి ఆయన మాటల్లోనే తీసుకుంటే కొందరు మాత్రమే పాతవారు రిపీట్ అవుతారు అని చెప్పారు. మరి తన పేరు ఉంటుందా లేదా అన్నది నాని గట్టిగా చెప్పలేదు. ఇక నానిని తిరిగి తీసుకుంటారా అన్నది అయితే ఎవరికీ తెలియదు. ఒకవేళ తీసుకుంటే అది జగన్ రాజకీయ ఎత్తుగడగానే చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొడాలి నానికి తీసుకోరాదని, ఆయన మాజీగానే ఉండాలని టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న మాటగా ఉందిట.

నాని జస్ట్ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ఉండాలని వారి కోరుకుంటున్నారు. అయితే ఇది రాజకీయం కాదంటే అవును అవుతుంది. అవును అంటే కాదు అవుతుంది. ఇపుడు మాజీ అయినా మరో నాలుగు రోజుల్లో నానీ మంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో కొడాలి నాని టాపిక్ హైలెట్ అవుతోంది. ఆయన మాజీగానే ఉంటారా లేదా అన్నది చూడాలి మరి.