Begin typing your search above and press return to search.

అట్రాసిటీ కేసంటే కులాల మధ్య చిచ్చా..?

By:  Tupaki Desk   |   6 July 2015 8:58 AM GMT
అట్రాసిటీ కేసంటే కులాల మధ్య చిచ్చా..?
X
భూమా నాగిరెడ్డిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కులాల మధ్య చిచ్చని అంటోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఆ పార్టీ ఎమ్మెల్యే నారాయణ స్వామి ఏకంగా ఈ ఉదంతానికీ, చంద్రబాబుకూ ముడిపెట్టేశారు. చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి పైన పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం చంద్రబాబు వైఖరిని స్పష్టం చేస్తోందని... భూమా పైన పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఇలాంటివి మొదటి నుండి అలవాటేనని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ప్రశ్నించిన నేరానికి భూమాపై కేసులు పెట్టించాని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు కూడా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన తమ ఎమ్మెల్యేలపై దళిత మంత్రులతో అట్రాసిటీ కేసులు పెట్టించారని... ఇలాంటి చర్యలతో చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన తీరు ఇలాగే ఉంటే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

కాగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోమవారం ఆసుపత్రికి వచ్చారు. భూమా మధుమేహం, రక్తపోటుతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల అనుమతితో అఖిల ప్రియ తండ్రిని కలిశారు. మెరుగైన చికిత్స కోసం భూమాను తిరుపతిలోని స్విమ్స్‌ లేదా హైదరాబాదులోని నిమ్స్‌కు తరలించే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పారు.