Begin typing your search above and press return to search.

టీడీపీ అంటే తెలుగు దాల్‌ పప్పు

By:  Tupaki Desk   |   5 Nov 2018 12:06 PM GMT
టీడీపీ అంటే తెలుగు దాల్‌ పప్పు
X
కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తుపై వైఎస్‌ ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌రోమారు త‌న‌దైన శైలిలో స్పందించారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుది ఐరన్‌ లెగ్‌ అని విమర్శించిన రోజా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నవాళ్లు ఎవరూ కూడా బాగుపడలేదని గుర్తుచేశారు. బాబుతో పొత్తు పెట్టుకున్న ఐకే గుజ్రాల్‌ - వాజ్‌ పేయి రిటైరయ్యారని ఇప్పుడు రాహుల్‌ తో పొత్తు పెట్టుకున్నారని - చిన్న వయస్సులోనే రాహుల్‌ రిటైరయ్యేటట్టు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. హైద‌రాబాద్‌ లో మీడియాతో మాట్లాడిన రోజా టీడీపీ నేతలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, చంద్రబాబు చొక్కాలు పట్టుకొని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్‌ కు వెన్నుపొటు పొడిచి టీడీపీని లాక్కున్నారని - ఇవాళ కాంగ్రెస్‌తో కలిసి మళ్లీ ఎన్‌ టీఆర్‌ ను మరోమారు చంపారనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. చంద్రబాబు టీడీపీని కాంగ్రెస్‌ తో కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. తన అధికార దాహం కోసం దేనికైనా చంద్రబాబు వెనుకాడడని చెప్పారు.

నలభై ఏళ్ల పాటు పోరాటం చేస్తున్న టీడీపీ ఇవాళ కాంగ్రెస్‌ తో ఎలా పొత్తు పెట్టుకుంటావని టీడీపీ నాయ‌కులు చంద్ర‌బాబును ప్రశ్నించాలని రోజా సూచించారు. మంత్రులు కేఈ కృష్ణమూర్తి - అయ్యన్నపాత్రుడు కాంగ్రెస్‌ తో పొత్తును వ్య‌తిరేకించార‌ని - ఇవాళ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సొంత పిల్లనిచ్చిన మామే చంద్రబాబు గాడ్సే కంటే హీనమని పేర్కొన్నట్లు గుర్తు చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి తనకు ఎదురు వచ్చిన ఎవరైనా లేపేస్తారని విమర్శించారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేదన్నారు. తన పరిపాలనపై నమ్మకం లేక కాంగ్రెస్‌ తో జత కట్టారని విమర్శించారు. రాహుల్‌ గాంధీని చూపించి ఓట్లు అడుక్కునేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గుంటూరు వస్తే..ఆయనపై చెప్పులు వేయించిన చంద్రబాబు ఆయనతో పొత్తులు ఎందుకు కుదుర్చుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న వారు బాగుపడిన చరిత్ర లేదన్నారు. ఆయన పొత్తు పెట్టుకున్న దేవగౌడ - వాజ్‌ పేయి రిటైర్డు అయ్యారని - పాపం చిన్న వయసులో ఉన్న రాహుల్‌ గాంధీతో ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారని - ఆయన కూడా రిటైర్డు అయ్యే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుది ఐరన్‌ లెగ్‌ అని అభివర్ణించారు.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సుడిగాలిలా ప్రజాభిమానంతో పైకి వస్తుంటే చూసి తట్టుకోలేక ఆయనను అడ్డు తొలగించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని రోజా ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేని ఒక కేంద్ర స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండు చేశారు. దీని వెనుక ఉన్న నిందితులందరూ కూడా బయటకు రావాలని కోరారు. త‌మ‌ది కోడి కత్తి పార్టీ అని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన ప్రభుత్వంలో, తన ఇంటలిజెన్స్‌ వైఫల్యం కారణంగా అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగితే దాన్ని సానుభూతిగా మార్చుకొని ఎన్నికలకు వెళ్లాలనే దుర్మార్గుడన్నారు. ఇదే వైజాగ్‌ లో చంద్రబాబుపై ఈ ఘటన జరిగి ఉంటే ఆయన ఓవరాక్షన్‌ ఎలా ఉండేదో ఊహించడమే కష్టమన్నారు. వైఎస్‌ జగన్‌ ఒక బాధ్యత గలిగిన పౌరుడిలా డిగ్నిఫైడ్‌గా ఆయామ్‌ సేఫ్‌ అంటూ బాధను, గాయాన్ని భరిస్తూనే విశాఖ నుంచి హైదరాబాద్‌ కు వచ్చారన్నారు. చేతికైన గాయంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే నాలుగు రోజులకే కడపలో ధర్మ పోరాటం పెట్టి ఎలా మాట్లాడారో అందరం చూశామన్నారు. ఇవాళ జేసీ దివాకర్‌రెడ్డి నీచంగా మాట్లాడుతున్నారని, వైఎస్‌ జగన్‌ రెడ్డి కాదు అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నాయకుడికి కులమెందుకు - గుణం ఉంటే చాలు అన్నారు. జేసీ - ఆదినారాయణరెడ్డి - సోమిరెడ్డితో వైఎస్‌ జగన్‌ ను తిట్టించి - నిన్న ప్రకాశం జిల్లాలే చంద్రబాబు కులాల పేరు చెప్పి ఓట్లు అడగకూడదని పేర్కొనడం దయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో మొత్తం కులాల కంపే ఉందన్నారు. కులాల వారిగా మనుషులను విడదీసి చిచ్చుపెడుతున్నారన్నారు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పోరాటం చేస్తే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్లు అరెస్టు చేయించారని - చంద్రబాబు చేతకాని తనం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోతే ధర్మపోరాట దీక్షలు చేస్తూ ఇతరులపై నెపం నెట్టుతున్నారన్నారు.