Begin typing your search above and press return to search.
చంద్రబాబు రైతు ద్రోహి:రోజా
By: Tupaki Desk | 4 July 2018 2:07 PM GMTగత నాలుగేళ్లలో చంద్రబాబు పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ లో అవినీతి - అరాచకం పేట్రేగిపోతోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం చేసిన అవినీతి - అక్రమాలు - అన్యాయాలు - భూకబ్జాల గురించి ప్రశ్నించిన వారిపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడడం...దూషణలకు దిగడం కొత్తేమీ కాదు. చంద్రబాబు పాలనను విమర్శించిన వారిపై - లోపాలను ఎత్తి చూపిన వారిపై కూడా దాడులు చేసేందుకు టీడీపీ నేతలు ఏమాత్రం వెనుకాడరు. వేలాదిమంది ఉసురు పోసుకున్న కాల్ మనీ రాకెట్ గురించి ప్రశ్నించిన కారణంగానే నగరి ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించిన ఘనత టీడీపీది. చంద్రబాబు సర్కార్ అవినీతి పాలనను ఏకిపారేస్తున్నారన్న కారణంతోనే రోజాపై టీడీపీ అక్కసు తీర్చుకుంది. అదే తరహాలో తాజాగా నగరిలో రోజా పై టీడీపీ కార్యకర్తలు పట్టపగలే దాదాగిరికి దిగారు. మహిళా ఎమ్మెల్యే అయిన రోజాపై దాడి చేసేందుకు సైతం టీడీపీ నేతలు యత్నించడం గమనార్హం. రోజాపై టీడీపీ నేతల దాడిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజాపై తెలుగుదేశం పార్టీ నేతలు దాదాగిరి చేశారు. పుత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొటోకాల్ ప్రకారం పాల్గొనడానికి వచ్చిన రోజాపై ప్రోటోకాల్ కు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా ఆమెపై దాడికి యత్నించారు. మంత్రి ఆమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో, రోజాకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వారిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అంతకు మందు మీడియాతో మాట్లాడిన రోజా...చంద్రబాబుపై నిప్పులు చెరిగిన నేపథ్యంలోనే ఆమెపై టీడీపీ నేతలు దాడికి దిగారు.
సీఎం సొంత జిల్లాలో రైతులు పంటను రోడ్డుపై పడేస్తున్నారని - చంద్రబాబుది అసమర్థ పరిపాలన అని, ఆయన రైతు ద్రోహి అనడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదని రోజా నిప్పులు చెరిగారు. సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఇక్కడ రైతులను చంద్రబాబు నట్టేట ముంచుతున్నారని రోజా మండిపడ్డారు. రైతుల శ్రమను టీడీపీ ప్రభుత్వం దోచుకుంటోందని, సొంత జిల్లా రైతులను పట్టించుకోని చంద్రబాబు ...ఏపీ రైతులకు ఏం న్యాయం చేస్తారని రోజా ఎద్దేవా చేశారు. ఇది చంద్రబాబు సర్కారుకు సిగ్గుచేటు కాదా అని రోజా ప్రశ్నించారు. రైతుల మీద చంద్రబాబుది దొంగ ప్రేమ అని మండిపడ్డారు. అంతకుముందు టమోటా - చెరుకు - వరి - వేరుశెనగ రైతులు రోడ్డెక్కారని - ఇపుడు మామిడి రైతులను కూడా చంద్రబాబు నాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రాసెసింగ్ యూనిట్ వారు..... కిలో మామిడి కాయలకు రూ.4 కూడా ఇవ్వడం లేదని...అయినా ప్రభుత్వం సైలెంట్ గా ఎందుకు ఉందని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు - ఎమ్మెల్యేలకు చెందిన ప్రాసెసింగ్ యూనిట్ లు సిండికేట్ అయ్యారని, అందుకే సీఎం సైలెంట్ గా ఉన్నారని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన టీడీపీ పాలకులు రైతులను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధర కోసం గత నెల మామిడి రైతులు కలెక్టర్ ను కలిశారని, రోడ్డుపై మామిడి పండ్లను పడేసి తమ నిరసన తెలిపారని అన్నారు. దీంతో, కిలోకు రూ.8 ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. ఆదికేశవులు నాయుడు, టీడీపీ నాయకుల ప్యాక్టరీల కోసం అమాయక రైతులను బలిచేస్తే వైసీపీ చూస్తూ ఊరుకోదని రోజా హెచ్చరించారు.