Begin typing your search above and press return to search.

నీ ఇంటికి నేను కాపలా కాయాలా... : వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   11 Jun 2022 8:21 AM GMT
నీ ఇంటికి నేను కాపలా కాయాలా... : వైసీపీ ఎమ్మెల్యే
X
గడప గడపకు మన ప్రభుత్వం అంటూ వైఎస్సార్సీపీ ఏ ముహూర్తంలలో కార్యక్రమం చేపట్టిందో కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అఖండ విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు ప్రతి ఇంటికీ వెళ్లి వైఎస్సార్సీపీ ఈ మూడేళ్ల పాలనలో వారికి జరిగిన లబ్ధిని వివరిస్తున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖను సైతం ప్రజల చేతిలో పెడుతున్నారు.

అయితే.. ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. వివిధ సమస్యలపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన మూడేళ్ల తర్వాత తాము గుర్తొచ్చామా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు కూడా శ్రుతి తప్పుతున్నారు. తమను సమస్యల పరిష్కారం కోసం నిలదీసినవారిపై చిందులు తొక్కుతున్నారు. అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇలాగే ఒక వ్యక్తిపై మండిపడ్డారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదోని మండలం చిన్నపెండేకల్లులో ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆంజనేయ అనే వ్యక్తి తన బిడ్డకు అమ్మ ఒడి పథకం అందలేదని.. అలాగే ఇంటి పట్టా కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చాడు. ఎన్నికల ముందు ఓట్ల కోసం మా దగ్గరికి ఓట్ల కోసం వచ్చారని.. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారని అనడంతో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అతడిపై మండిపడ్డారు. "ఎమ్మెల్యే వచ్చే.. చూసే.. పోయే.. అని కూస్తావా.. నీ ఇంటికి నేను కాపలా కాయాలా? నీ ఇంటి దగ్గర నేనొచ్చి పొర్లాడాలా? ఎందుకు అరుస్తున్నావు? లే కొడకా" అంటూ ఆంజనేయపై బూతుల దండకం ఎత్తుకున్నారు. అయినా ఆంజనేయ ఏమాత్రం తగ్గకపోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి జారుకున్నారు.

అదేవిధంగా చిన్నపెండేకల్లులో మాజీ వైస్‌ సర్పంచ్‌ లక్ష్మన్నపై కూడా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రైతు భరోసా పడిందా?' అని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. 'అవును రెడ్డీ.. పడింది' అంటూ లక్ష్మన్న సమాధానం ఇచ్చారు. "అయితే తాగడానికి సరిపోతుందిలే" అని ఎమ్మెల్యే వెటకారంగా మాట్లాడారు. దీంతో లక్ష్మన్న చిన్నపుచ్చుకున్నారు.

మాజీ వైస్‌ సర్పంచును ఎమ్మెల్యే అలా అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాగా ఎమ్మెల్యే పర్యటనలో అడుగడుగునా మహిళలు ఆయనను నిలదీశారు. తాగునీరు సమస్య తీవ్రంగా ఉందని.. తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్నామని.. మీకు సమస్య కనిపించడం లేదా అని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని మహిళలు నిలదీశారు. ముసలోళ్లం.. అవిటివాళ్లం. తాగునీటి కోసం పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా? అని వృద్ధురాలు నరసమ్మ ఎమ్మెల్యేపై మండిపడింది. దీంతో ఎమ్మెల్యే ఊరంతా పైపులైను వేయాలని అధికారులకు చెప్పారు. అదేవిధంగా తమకు అర్హత ఉన్నా వృద్ధాప్య పింఛన్ రావడం లేదని, వివిధ పథకాలు అందడం లేదని పలువురు ఎమ్మెల్యేను నిలదీశారు.

అలాగే రామలక్ష్మి అనే ఒక మహిళ జగనన్న చేదోడు పథకం కింద ఆర్థిక సాయం వస్తుందని అప్పు చేసి మిషన్ కొన్నానని.. అయితే రెండేళ్ల నుంచి సచివాలయం చుట్టూ తిరుగుతున్నా సాయం మాత్రం అందడం లేదని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ.. ముందు శిక్షణ ఇవ్వబడునని ఇంటికి బోర్డు పెట్టుకో అంటూ ఆమెకు చెప్పి వెళ్లిపోయారు. తాను అడుగుతున్నది ఏమిటి?.. ఎమ్మెల్యే చెబుతున్నదేమిటని ఆమె అసహనం వ్యక్తం చేశారు.