Begin typing your search above and press return to search.

ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యే .. భయపడకూడదంటూ సూచన !

By:  Tupaki Desk   |   29 July 2020 11:30 PM GMT
ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యే .. భయపడకూడదంటూ సూచన !
X
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత పది రోజులుగా ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకి నమోదు అయ్యే కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే పోతుంది. తాజాగా నేడు ఏకంగా ఒకేసారి 10 వేలకి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇలా రాష్ట్రంలో ఒకేసారి 10 వేలకి పైగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కేసులు పెరుగుతుండటం తో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఈ క్రమంలో కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువ కలిగిన రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా నుండి కోలుకున్న కొందరు ప్లాస్మా దానం చేస్తే వారికీ ఏమౌతుందో అని భయపడుతున్నారు. అలాంటి వారిలో దైర్యం నింపేందుకు కరోనా నుండి కోలుకున్న పోలీసులు, ప్రజాప్రతినిధులు ప్లాస్మా దానం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్లాస్మా దానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చిందని భయపడకూడదని, అలాగని అజాగ్రత్తగా కూడా ఉండకూడదన్నారు. తనకు గత నెల 20న కరోనా వచ్చిందని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ప్లాస్మా దానం వల్ల మరో ముగ్గురు కరోనా బాధితులకు ప్రాణదానం చేయవచ్చన్నారు. కరోనా నుండి కోలుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్మా దానం చేయాలనీ కోరారు.