Begin typing your search above and press return to search.

అంత డబ్బంటే మినీ లారీలు కావాలిగా..?

By:  Tupaki Desk   |   9 April 2016 8:14 AM GMT
అంత డబ్బంటే మినీ లారీలు కావాలిగా..?
X
మారిన రాజకీయాల పుణ్యమా అని ఒక్క విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది. నాయకుడు ఎవరైనా సరే.. చేతిలో పవర్ లేకుండా వెంట ఉండటమన్నది గాల్లో దీపం మాదిరి మారిందని చెప్పక తప్పదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారపక్షం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పుణ్యమా అని విపక్ష నేతలు ఎప్పుడు అధికారపక్షంలోకి జంప్ అవుతారన్నది అర్థం కానిదిగా మారింది.

విపక్షంలో కూర్చోవటానికి ఏమాత్రం ఇష్టపడని వైనం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. పదవి వచ్చినా రాకున్నా.. అధికారపక్షంలో ఉన్నామన్న ధీమా చాలన్న మాటతో పాటు.. భవిష్యత్తుకు ఢోకా లేదన్న భరోసా కూడా వారిని పార్టీ మారేలా చేస్తోంది. జంపింగ్ చేస్తున్న నేతల ఆలోచనలు ఈ తీరులో ఉంటే.. విపక్ష అధినేతల పరిస్థితి మరోలా ఉంది. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. హామీ ఇవ్వాలంటే చేతిలోఅధికారం లేని పరిస్థితి.

ఇలాంటి వేళ.. జారిపోతున్న నేతల్ని అడ్డుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వెళ్లే వారు వెళుతూనే ఉన్న నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై ఘాటైన వ్యాఖ్యలు చేయటం మినహా మరో అవకాశం లేని పరిస్థితి. ఈ కారణంతోనే పార్టీ నుంచి జంప్ అవుతున్న నేతల పైనా.. అధికారపక్షం పైనా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏపీ విపక్ష నుంచి అధికారపక్షం వైపు జంప్ అవుతున్న నేతల మీద వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత మొదలు.. ముఖ్యనేతలంతా తీవ్రస్థాయిలో మండిపడుతూ.. తమ ఎమ్మెల్యేల్ని లాగేసుకునేందుకు అధికారపక్షం రూ.20 నుంచి రూ.30 కోట్ల మేర ముట్టచెబుతుందన్న ఆరోపణల్ని సంధిస్తున్నారు.

తాజాగా ఈ తరహా ఆరోపణను ఎదుర్కొంటున్నారు నెల్లూరుజిల్లా గూడురు ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఉగాది పండుగ రోజు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేసి.. హుషారుగా సైకిల్ ఎక్కేశారు. ఈ సందర్భంగా తనపై చేస్తున్న ఆరోపణల్ని సునీల్ ఖండిస్తూ.. తన తాజా మాజీ అధినేతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారినందుకు రూ.20 నుంచి రూ.30 కోట్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారని.. వారి ఆరోపణలే నిజమైతే.. అంతేసి డబ్బులు తీసుకోవటానికి మినీ లారీలు అవసరమవుతాయని వ్యాఖ్యానించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే ఊరుకోనని.. పార్టీలో ఉన్న సమయంలో తనకు ఎదురైన అవమానాల్ని బయటకు చెప్పాల్సి వస్తుందంటూ ఆయన హెచ్చరిస్తున్నారు. మరి.. పార్టీ లోగుట్టును రట్టు చేస్తానంటున్న తన మాజీ విధేయుడి మాటలకు జగన్ అండ్ కో ఎలా స్పందిస్తారో..?