Begin typing your search above and press return to search.

జగన్ ఎమ్మెల్యే సునీల్ నోట రూ.10కోట్ల మాట

By:  Tupaki Desk   |   6 April 2016 3:13 PM IST
జగన్ ఎమ్మెల్యే సునీల్ నోట రూ.10కోట్ల మాట
X
ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా విపక్ష పార్టీ ఎమ్మెల్యేని అధికారపార్టీలోకి తీసుకొచ్చే ప్రక్రియపై లెక్కలు చాలానే ఉంటాయన్నది తెలిసిన విషయమే. కాకుంటే.. జంపింగ్ ఎమ్మెల్యే ఒకరు అలాంటి లెక్కల్ని కాస్త ఓపెన్ గా చెప్పటం ఆసక్తికరమని చెప్పాలి. నెల్లూరు జిల్లా గూడురు ఎమ్మెల్యే సునీల్ ఉగాది రోజున సైకిల్ ఎక్కేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే విషయాన్ని తాజాగా ప్రకటించిన ఆయన.. తాను పార్టీ మారే ముహుర్తాన్ని వెల్లడించారు. ఉగాది రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబు సమక్షంలో తాను పార్టీ మారనున్నట్లు చెప్పిన సునీల్.. తాను పార్టీ మారటానికి కారణాన్ని చెప్పేశారు. తన నియోజకవర్గానికి మంత్రి నారాయణ రూ.10కోట్ల నిధులు ఇస్తానని చెప్పారని.. ఆ నిధులతో నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొచ్చని అందుకే తాను టీడీపీలోకి చేరుతున్నట్లు చెప్పారు.

తాను పార్టీ మారినందుకు ప్రతిఫలంగా మంత్రి నారాయణ తన శాఖ నుంచి రూ.10కోట్లు ఇస్తానని మాట ఇచ్చారంటూ అంత ఓపెన్ గా ఎమ్మెల్యే సునీల్ చెప్పిన తీరు ముచ్చటగా ఉన్నా.. ఓపెన్ గానే ఇంత ఆఫర్ ఉంటే.. నాలుగు గోడల మధ్య మరెంత భారీ డీల్ కుదిరి ఉంటుందన్నది ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. ఆ మాత్రం లాభం లేకుండానే.. పార్టీ మారేస్తారా.. ఏంటి..?