Begin typing your search above and press return to search.

కాయ్ రాజా కాయ్.. ఏఎంసీ చైర్మ‌న్ పోస్టుల ధ‌ర కోట్ల‌లో?

By:  Tupaki Desk   |   17 Dec 2019 12:30 PM GMT
కాయ్ రాజా కాయ్.. ఏఎంసీ చైర్మ‌న్ పోస్టుల ధ‌ర కోట్ల‌లో?
X
ఒక‌వైపు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అవినీతి ర‌హిత పాల‌న కోసం శ‌త‌థా ప్ర‌య‌త్నిస్తున్న దాఖ‌లాలు క‌నిపిస్తూ ఉన్నాయి. అవినీతి ర‌హిత పాల‌న‌లో భాగంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని ర‌కాల అవినీతినీ అరిక‌ట్టేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా త‌న పార్టీ నేత‌ల‌కు కూడా ఆయ‌న గ‌ట్టిగానే క్లాసులు పీకుతూ ఉన్నారు. అవినీతి వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చిన ఎమ్మెల్యేలు - మంత్రుల‌కు - ఎంపీల‌కు కూడా ఇది వ‌ర‌కూ ముఖ్య‌మంత్రి నుంచి గ‌ట్టి హెచ్చ‌రిక‌లే వచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

అయితే కొంద‌రు ఎమ్మెల్యేలు సీఎం ప్ర‌య‌త్నాల‌ను ప‌ట్టించుకోన‌ట్టుగా తెలుస్తోంది. అయిన కాడికి సంపాదించుకోవ‌డ‌మే ధ్యేయంగా కొంద‌రు రెచ్చిపోతున్న దాఖ‌లాలు క‌నిపిస్తూ ఉన్నాయి. ప్ర‌భుత్వ ప‌ర‌మైన అవినీతి చేస్తే ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర ఇట్టే దొరికిపోయే అవ‌కాశం ఉంది ఎమ్మెల్యేలు. ఇలాంటి నేప‌థ్యంలో వారు త‌మ చేతిలోని నామినేటెడ్ పోస్టుల అమ్మ‌కానికి పూనుకుంటున్నార‌ని స‌మాచారం.

అలాంటి వాటిల్లో ఒక‌టి అగ్రిక‌ల్చ‌ర్ మార్కెట్ చైర్మ‌న్ పోస్టులు. సాధార‌ణంగా అధికార పార్టీలోని పొలిటిక‌ల్ యాక్టివిస్టుల‌కు ఈ పోస్టులు ద‌క్కుతూ ఉంటాయి. మండ‌లాల స్థాయి - ఆపై స్థాయిలో ఈ పోస్టుల‌కు మంచి డిమాండ్ ఉంటుంది. అగ్రిక‌ల్చ‌ర్ మార్కెట్ చైర్మ‌న్ గా ప‌ని చేసే వ్య‌క్తి సంపాదించుకోవ‌డం మాట ఎలా ఉన్నా మంచి గుర్తింపు ద‌క్కుతుంది. కొన్ని మార్కెట్ యార్డ్స్ లో మాత్రం సంపాద‌న‌కు కూడా మంచి అవ‌కాశాలు ఉంటాయి.

ఇలాంటి నేప‌థ్యంలో అలాంటి వాటికి పోటీ గ‌ట్టిగా క‌నిపిస్తూ ఉంది. ఈ అవ‌కాశాన్ని ఎమ్మెల్యేలు ఉప‌యోగించుకుంటున్నార‌ని స‌మాచారం. కొన్ని చోట్ల అయితే కోట్ల రూపాయ‌ల ధ‌ర‌కు ఈ పోస్టుల‌ను అమ్ముకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది. ఓసీ కి రిజ‌ర్వ్ అయిన చోట అయితే మూడు నుంచి నాలుగు కోట్ల‌ రూపాయ‌ల ధ‌ర‌కు ఈ నామినేటెడ్ పోస్టును అమ్ముకుంటున్నారు ఎమ్మెల్యేలు. అదే బీసీకి అవ‌కాశం ఉన్న చోట రెండున్నర కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ధ‌ర ప‌లుకుతూ ఉంద‌ని స‌మాచారం. బీసీ-బీ కి రిజ‌ర్వ్ అయిన చోట అంత‌క‌న్నా కొంచెం త‌క్కువ ధ‌ర‌కు ఏఎంసీ పోస్టుల‌ను అమ్ముకుంటున్నార‌ట ఎమ్మెల్యేలు. పార్టీ కోసం ప‌ని చేసిన వారిని కూడా ప‌ట్టించుకోకుండా, ఇప్పుడు డ‌బ్బులు చెల్లించ‌గ‌లిగే వాళ్ల‌ను ఎంచుకుని ఎమ్మెల్యేలు ఈ పోస్టుల అమ్మకాలు సాగిస్తున్న‌ట్టుగా స‌మాచారం!