Begin typing your search above and press return to search.

వైసీపీ నేతల్లో భయం..జగన్ విస్మయం..!

By:  Tupaki Desk   |   29 May 2019 5:30 PM GMT
వైసీపీ నేతల్లో భయం..జగన్ విస్మయం..!
X
ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. భారీ విజయంతో ఆయనపై బాధ్యత మరింత పడనుంది. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే జగన్ పలు హామీలు ఇచ్చారు. కేవలం ఆరు నుంచి పన్నెండు నెలల్లోనే తానెంత మంచి ముఖ్యమంత్రినో నిరూపిస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించిన నవరత్నాలకు తోడు - మేనిఫెస్టోలోని అంశాలను ఎంత కాలంలో అమలు చేస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. దీంతో జగన్‌ పాలన ఎలా ఉంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరోవైపు - వైసీపీలో సరికొత్త చర్చలకు తెర లేస్తోంది.

ఒకవైపు - జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పట్లు జరుగుతుండగా.. మరోవైపు - ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం మంత్రి పదవులు కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు అధినేతతో భేటీ కూడా అయ్యారని తెలిసింది. మరికొందరు మాత్రం జగన్‌ను కలిసే వీలు లేకపోవడంతో పార్టీలోని ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే, మంత్రి వర్గ ఏర్పాటుకు జగన్ కొంత సమయం తీసుకుంటానని ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి సమయంలో ఆ పార్టీలో స్పీకర్ పదవి చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. దీనికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు తెలంగాణ ముందస్తుతో పాటు మొన్నటి ఏపీ ఎన్నికల వరకు స్పీకర్ పదవిలో ఉన్న నేతలు ఓడిపోవటం అనే బలమైన సెంటిమెంట్‌ అని వినికిడి.

వాస్తవానికి దాదాపు 20 ఏళ్లుగా అదే జరుగుతోంది. 1991లో అసెంబ్లీ స్పీకర్‌ గా పనిచేసిన శ్రీపాదరావు తరవాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తొలి మహిళా స్పీకర్‌గా 1999లో ఆ కుర్చీలో కూర్చున్న ప్రతిభా భారతి ఆ తరవాత ఎన్నికల్లో ఓడిపోయారు. నాటినుంచి ప్రతీ ఎన్నికల్లో ఓడిపోతూ ఒకదశలో తెరమరుగే అయ్యారు. ఇక 2004లో స్పీకర్‌ గా పనిచేసిన సురేశ్‌ రెడ్డి - 2009లో స్పీకర్‌ గా పనిచేసిన నాదేండ్ల మనోహర్ కూడా మళ్లీ ఎమ్మెల్యేలు కాలేదు. తెలంగాణ ఏర్పడిన తరవాత మొదటి అసెంబ్లీకి మధుసూదనాచారి స్పీకర్‌ గా వ్యవహరించి - ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయారు. నిన్న కోడెలది కూడా అదే పరిస్థితి. సో.. అసెంబ్లీ సభాపతి కుర్చీలో కూర్చుంటే ఇక మళ్లీ గెలుపు కష్టమేననే భావన అందర్లోనూ బలపడింది. ఈ కారణంగానే వైసీపీ నాయకులు స్పీకర్ పదవి తమకు వద్దంటే వద్దంటూ తేల్చి చెబుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.