Begin typing your search above and press return to search.

జీతాలు వదిలేద్దామా : జగన్ దళం యోచన!

By:  Tupaki Desk   |   3 Nov 2017 6:29 PM GMT
జీతాలు వదిలేద్దామా : జగన్ దళం యోచన!
X
ఎటొచ్చీ.. అసెంబ్లీని బహిష్కరించాం... పార్టీకోసం ఎన్నెన్నో త్యాగాలకు సిద్ధపడుతున్నాం.. మన మీద మళ్లీ బురద చల్లడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వడం ఎందుకు? అసెంబ్లీ రాకుండా జీతాలు మాత్రం తీసుకుంటున్నారు.. అని సాంకతిక కారణాలు చూపించి.. తమ మీద బురదచల్లడానికి వారికి ఆస్కారం కల్పించడం ఎందుకు? ఆ జీతాలను కూడా త్యాగం చేస్తే పోతుంది కదా.. ? అనే భావన కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో వ్యక్తం అవుతున్నట్లుగా తెలుస్తోంది. పాలకపక్షంలోని కొందరు నాయకులు - సభకు రాకపోవడం వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించిన అసలు కారణాల మీమాంస వదిలేసి - వారు జీతాలు తీసుకుంటున్నారు గదా అనే అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ రాద్ధాంతం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి వైకాపా ఎమ్మెల్యేలు కొందరు- జీతాలను కూడా వదిలేసుకుంటే ఏమౌతుంది? అనే ప్రతిపాదన తెస్తున్నట్లుగా సమాచారం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభను బహిష్కరించాలని నిర్ణయించిన తర్వాత.. వారి మీద అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ రాబోము అని ప్రకటించిన జగన్ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడంపై కోర్టుకు వెళ్తాం అంటూ కొందరు యాగీచేయడం.. దానికి వైకాపా నాయకులు కూడా కౌంటర్లివ్వడం జరిగింది. అయితే ఈ రాద్ధాంతం అంతా ఎందుకు.. తామే జీతాలను వదిలేసుకుంటే హుందాగా ఉంటుంది కదా.. అని పలువురు ఆలోచిస్తున్నారు.

కాకపోతే.. వారికి ఇక్కడ ఒక సాంకేతిక సమస్య సందేహం తలెత్తుతున్నట్లుగా తెలుస్తోంది. శాసనసభకు హాజరు కాకుండా, జీతాలు కూడా తీసుకోకపోతే.. అసలు ఆ పదవికే రాజీనామా చేసినట్లుగా కలర్ పులుముతారేమోనని.. అలాకాకుండా.. జీతాల మీద తమకు ఆసక్తి లేదని చాటుకోవాలంటే గనుక.. జీతాలు తీసుకుని.. పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కలిపి తమ తమ నియోజకవర్గాల్లో పేదలకు - లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలుగా ఇచ్చేసి.. ప్రభుత్వ పార్టీచేస్తున్న దుష్ప్రచారానికి దీటుగా సొంత ఇమేజి పెంచుకోవాలనే సలహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే అధికార పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కేవలం కొందరిలో మొదలైన ఈ ప్రతిపాదనకు క్రమంగా పలువురి మద్దతు లభిస్తున్నదని.. జగన్ కూడా ఓకే అంటే.. అందరూ జీతాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.