Begin typing your search above and press return to search.

బాబుతో జగన్ ఎమ్మెల్యేల రిక్వెస్ట్ మీటింగ్

By:  Tupaki Desk   |   25 Nov 2016 5:49 AM GMT
బాబుతో జగన్ ఎమ్మెల్యేల రిక్వెస్ట్ మీటింగ్
X
తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లుగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గడిచిన కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేదు. సిద్దాంత పరంగా తేడాలున్నప్పటికీ వ్యక్తులుగా మాత్రం రాజకీయ నేతల మధ్య సంబంధాలు బాగుండేవి. అధికార.. విపక్షాల మధ్య ఎన్ని పంచాయితీలు ఉన్నా వ్యక్తిగతంగా టార్గెట్ చేసే పరిస్థితి చాలా అరుదుగా ఉండేది. దూకుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా.. రాజకీయాల స్వరూపాన్ని మొత్తంగా మార్చేశారన్న ఆరోపణలు మూటగట్టుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనూ పార్టీలకు అతీతంగా అధికార.. విపక్షాల మధ్య సంబంధాలు సాగేవి.

అవసరాలకు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లటం.. తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరటం.. అడిగి పనులు చేయించుకోవటం ఉండేది. ఎక్కడిదాకానో ఎందుకు.. తిరుగులేని నేతగా అవతరించిన వైఎస్ ను విమర్శ చేయటం కదా.. ఆ ఆలోచన రావటానికి కూడా భయపడిన సందర్భాలెన్నో. అలాంటి వేళ ఆయన్ను ఓపెన్ గా విమర్శించి సత్తా కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సొంతం. వైఎస్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన తీరు అందరిని ఆకర్షించేది. అదే సమయంలో.. అందుకు భిన్నంగా ఆయన సతీమణి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజాతమ్మ ముఖ్యమంత్రి వైఎస్ వద్దకు వెళ్లి.. ‘అన్నా.. మా నియోజకవర్గంలో చేపట్టే కార్యక్రమాలకు నిధుల అవసరం ఉందని చెప్పటమే కాదు.. ఆయన ఆమోద ముద్ర వేసేలా చేసేవారు.

ఇప్పుడు అలాంటివి ఊహించగలమా? రాజకీయ శత్రుత్వాన్ని వ్యక్తిగత శత్రుత్వంగా మార్చుకున్న తీరు తెలుగు రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని.. రాగద్వేషాలకు అతీతంగా పాలిస్తామని అధికారపక్షం నేతలు చెప్పినా.. ఆ మాటలు నేతి బీర చందమన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ విభేదాలతో నియోజకవర్గ అభివృద్ధిపై విపక్ష నేతలు లైట్ తీసుకోవటం.. అదేమంటే.. అధికారపక్షం తమకు నిధులు ఇవ్వటం లేదన్న ఆరోపణ చేయటం తెలిసిందే. ఇలాంటి అంశాలకు సంబంధించి ఏపీలో నెలకొన్న పరిస్థితి చూస్తే.. విపక్ష నేతలు ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా ఇష్టపడరని చెబుతారు. నియోజకవర్గ పనుల కోసం కొంతమంది జగన్ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును కలవాలని అనుకున్నా.. అధినేతకు ఎక్కడ ఆగ్రహం వస్తుందన్న భయంతో వెనక్కి తగ్గుతారని చెబుతారు.

ఇలాంటి వేళ.. తాజగా జగన్ బ్యాచ్ ఎమ్మెల్యేలంతా కలిసి ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వినతులతో ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని.. తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించాలని వారు కోరనున్నట్లు చెబుతున్నారు. స్టేట్ డెవలప్ మెంట్ ఫండ్ ను తమ నియోజకవర్గాలకు కేటాయించే విషయంలో ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తుందని చెబుతున్న జగన్ ఎమ్మెల్యేలు.. బాబును కలిసి తమకు నిధులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. మరి.. జగన్ బ్యాచ్ ఎమ్మెల్యేల వినతిపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/