Begin typing your search above and press return to search.

సొమ్ము కార్యకర్తలదీ.. సోకు వైసీపీ ఎమ్మెల్యేదా?

By:  Tupaki Desk   |   27 April 2020 3:30 PM GMT
సొమ్ము కార్యకర్తలదీ.. సోకు వైసీపీ ఎమ్మెల్యేదా?
X
దాదాపు పదేళ్లు ప్రతిపక్షంలో అష్టకష్టాలు పడి వైసీపీని అధికారంలోకి తెచ్చారు జగన్. అధికారం ఎంతకష్టపడితే వస్తుందని ఆయనకు తెలుసు. అందుకే ఆ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి సంక్షేమానికే వెచ్చిస్తూ ప్రజాసంక్షేమ పాలన తెస్తూ మరో రాజన్న రాజ్యాన్ని ఏపీలో తీసుకొస్తున్నారు. ప్రత్యర్థుల ప్రతిపక్ష మీడియా బలంగా ఉండి జగన్ ను వెనక్కి నెడుతున్నా.. వెకిలిగా అవమాన పరుస్తున్నా మొక్కవోని దీక్షతో జగన్ ముందుకు వెళుతున్నారు. జగన్ సీఎంగా ఇప్పటికీ ఎక్కువ పనిచేస్తూ తక్కువ పబ్లిసిటీ కోరుకుంటూ ప్రజలకు ఎక్కువ పాలనను చేరువ చేస్తున్నారు.

జగన్ ఇంత చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం పబ్లిసిటీ కే ప్రాధాన్యత ఇస్తుండడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే మాత్రం కార్యకర్తలపై ఆర్థిక భారం మోపడం తీవ్ర చర్చనీయాంశమైంది. కరోనా టైంలో కార్యకర్తలంతా కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కు డబ్బులు విరాళాలు జమచేసి ఎమ్మెల్యేకు ఇస్తే వాటిని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వకుండా తన పబ్లిసిటీకి వినియోగించిన తీరు నియోజకవర్గంలో దుమారం రేపింది.

తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యేకు సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులను కార్యకర్తలు ఇస్తే.. వాటిని ప్రభుత్వానికి ఇవ్వకుండా వాటిని తన పేరుతో పబ్లిసిటీకి ఖర్చు చేయడంపై కార్యకర్తలు - నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఆ డబ్బులతో రైసు బ్యాగులను తయారు చేసి పేదలకు తన పేరుతో పంచడానికి ఆ ఎమ్మెల్యే రెడీ అయ్యారట. దాని మీద ఎమ్మెల్యే పేరు తాటికాయలంత అక్షరాలతో ముద్రించుకొని కింద డబ్బులిచ్చిన కార్యకర్తల పేర్లు చిన్నగా కింద కనిపించకుండా ముద్రించాడు. తాజాగా ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా ఉందని వైసీపీ నేతలు ఈ వ్యవహారాన్ని ఆడిపోసుకుంటున్నారు.ఈ ఫొటోను తీసుకొని సోషల్ మీడియాలోనూ ట్రోల్ చేస్తున్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాల్సిన డబ్బులను ఎమ్మెల్యే ఇలా డైవర్ట్ చేసుకొని సొంత ఇమేజ్ పెంచుకోవడం ఏంటని వైసీపీ సోషల్ మీడియా వర్గాలు ఆరోపిస్తున్నాయి. కార్యకర్తల సొమ్ము తన సొమ్ము మాదిరి పబ్లిసిటీకి ఉపయోగిస్తున్నాడని.. సీఎం జగన్ కు పబ్లిసిటీ దక్కకుండా తనకే దక్కేలా కుట్ర పన్నుతున్నాడని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ఎమ్మెల్యే వల్ల వైసీపీకి నష్టం వస్తోందని.. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.