Begin typing your search above and press return to search.

సొంత పార్టీ నేత‌ల నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వీరే!

By:  Tupaki Desk   |   15 Sep 2022 8:30 AM GMT
సొంత పార్టీ నేత‌ల నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వీరే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలుపు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్సీపీ, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలిచి వైఎస్సార్సీపీపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని టీడీపీ, త‌న ఉనికిని చాటుకోవాల‌ని జ‌న‌సేన తీవ్ర ప్ర‌య‌త్నాల్లో ఉన్నాయి.

ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు, ఎమ్మెల్సీల‌కు దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కి 175 సీట్లు సాధించాల‌ని క‌ర్తవ్య బోధ చేశారు. అయితే జ‌గ‌న్ ఆశ‌లు ఫ‌లించేలా లేవ‌ని అంటున్నారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సొంత పార్టీ నేత‌ల నుంచే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు జిల్లా న‌గ‌రిలో మంత్రి రోజాకు, తూర్పుగోదావ‌రి జిల్లా రాజాన‌గరంలో జ‌క్కంపూడి రాజాకు, బందరులో మాజీ మంత్రి పేర్ని నానికి సొంత పార్టీ నేత‌ల నుంచే ఇబ్బందులు ఉన్నాయ‌ని స‌మాచారం.

అలాగే ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లో ప‌ట్ట‌ణ అధ్యక్ష ప‌ద‌వికి వైఎస్సార్సీపీ నేత రాజీనామా చేయ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భానుకు సొంత పార్టీలోనే అస‌మ్మ‌తి సెగ ఉంద‌ని తెలుస్తోంది. ఇక కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్థ‌సార‌ధి ప‌రిస్థితి ఇలాగే ఉంది. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఉయ్యూరు వైఎస్సార్సీపీ మ‌హిళా జెడ్పీటీసీ రాజీనామా వ్య‌వ‌హారం ఇటీవ‌ల రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇక బంద‌రులో ఎంపీ వ‌ల్ల‌భనేని బాల‌శౌరి నేరుగా ఎమ్మెల్యే పేర్ని నానిపై తీవ్ర విమ‌ర్శ‌లు సంధించారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా మైల‌వ‌రంలో వసంత కృష్ణ‌ప్ర‌సాద్‌పై ఆయ‌న సొంత సామాజిక‌వ‌ర్గం క‌మ్మ‌లే మండిప‌డుతున్నార‌ని చెబుతున్నారు. ఇసుక తవ్వకాలు, గ్రావెల్ తవ్వ‌కాల వ్య‌వ‌హారంలో సొంత పార్టీ నేత‌ల నుంచే ఆయ‌న అస‌మ్మ‌తి ఎదుర్కొంటున్నార‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు సీటు ఇస్తే మైల‌వ‌రం మీద ఆశ‌లు వ‌దిలేసుకోవాల్సిందేన‌ని అస‌మ్మ‌తి నేత‌లు వార్నింగ్ ఇస్తున్నారు. అందులోనూ అక్క‌డ టీడీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన అభ్య‌ర్థి దేవినేని ఉమా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వ‌సంత గెల‌వ‌డం ఈసారి క‌ష్ట‌మేనంటున్నారు.

అదేవిధంగా ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేల‌కు సొంత పార్టీ నేత‌ల సెగ ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వినుకొండ‌, పెద‌కూర‌పాడు, స‌త్తెన‌ప‌ల్లి, గుర‌జాల‌ ఉన్నాయని వార్త‌లు వ‌స్తున్నాయి. వినుకొండ‌లో బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు తొలిసారి గెలుపొందారు. ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి జీవీ ఆంజ‌నేయులు బ‌లంగా ఉన్నార‌ని అంటున్నారు. అందులోనూ ఆయ‌న 2009, 2014ల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. బొల్లా బ్ర‌హ్మ‌నాయుడుకు సొంత పార్టీ నేత‌ల నుంచే అస‌మ్మ‌తి ఎదుర‌వుతోంద‌ని చెబుతున్నారు. ఇక గుర‌జాల‌లో కాసు మ‌హేష్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్క‌డ ఈయన‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, నియోజ‌వ‌ర్గానికే చెందిన జంగా కృష్ణ‌మూర్తి యాద‌వ్‌తో ఆధిప‌త్య పోరు న‌డుస్తోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల ఫ్లెక్సీల వ్య‌వ‌హారం కూడా ఇద్ద‌రు మ‌ధ్య విమ‌ర్శ‌ల‌కు దారితీసింద‌ని చెబుతున్నారు.

ఇక స‌త్తెన‌ప‌ల్లిలో అంబ‌టి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంబ‌టి రాంబాబు స‌త్తెన‌ప‌ల్లికి స్థానికుడు కాదు. ఆయన సొంత వూరు.. రేప‌ల్లె. 1989లో రేప‌ల్లె నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు అక్క‌డి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. దీంతో 2014 ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లికి వ‌చ్చి పోటీ చేసి స్వ‌ల్ప మెజారిటీ తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు. 2019లో వైఎస్సార్సీపీ వేవ్‌లో గెలుపొందారు. అయితే వ‌చ్చేసారి మాత్రం క‌ష్ట‌మేనంటున్నారు. ఆయ‌న‌పైన సొంత పార్టీలోనే తీవ్ర అస‌మ్మ‌తి ఉందని వార్త‌లు వ‌చ్చాయి.

పెద‌కూర‌పాడులోనూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నంబూరి శంక‌ర‌రావుకు సొంత పార్టీ నేత‌ల నుంచే చిక్కులు త‌ప్ప‌డం లేద‌ని అంటున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌టి నుంచి కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ప‌నిచేస్తూ వ‌చ్చారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు పోటీ చేశారు. ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థి కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ చేతిలో ఓడిపోయారు. 2019లో చివ‌రి నిమిషంలో రియ‌ల్ ఎస్టేట్ సంస్థ అధినేత నంబూరు శంక‌ర‌రావుకు వైఎస్సార్సీపీ సీటు ఇచ్చింది. ఆయ‌న స్వ‌ల్ప మెజారిటీతోనే గెలుపొందారు. అయితే నంబూరు శంక‌రరావు గెలిచిన ద‌గ్గ‌ర నుంచి వ్యాపారాల‌పైనే ఫోక‌స్ పెడుతున్నార‌ని పార్టీ కార్య‌క్ర‌మాలు, కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండ‌ర‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై స‌హ‌జంగానే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు.

ఇక గ‌న్న‌వ‌రంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నారు .గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన వంశీ ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీతో అంట‌కాగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున వంశీనే పోటీ చేసే అవ‌కాశం ఉంది. అయితే ఆయ‌న గెలిచే అవ‌కాశాలు ఏమాత్రం లేవ‌ని అంతా అంటున్నారు. ఓవైపు జిల్లా కేంద్ర స‌హ‌కార బ్యాంక్ చైర్మ‌న్ యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, మ‌రోవైపు వైఎస్ఆర్సీపీ పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ బోర్డు సభ్యుడు, దివంగ‌త సీఎం వైఎస్సార్ స‌న్నిహితుడు దుట్టా రామ‌చంద్ర‌రావులు వ‌ల్ల‌భ‌నేని వంశీపై తీవ్ర అస‌మ్మ‌తి వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో గ‌న్న‌వ‌రంపై ఆశ‌లు వ‌దిలేసుకోవాల్సిందేన‌ని పేర్కొంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.