Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎంపీలు రాజీనామా చేస్తారట‌!

By:  Tupaki Desk   |   25 Oct 2016 10:41 AM GMT
జ‌గ‌న్ ఎంపీలు రాజీనామా చేస్తారట‌!
X
కొద్దికాలంగా మ‌రుగున ప‌డిన ఏపీ ప్ర‌త్యేక హోదా అంశం మ‌ళ్లీ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. వ‌చ్చే నెల మొద‌టి వారంలో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై.. జై ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరిట భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్న విష‌యాన్ని ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. జ‌గ‌న్ స‌భ జ‌రిగిన నాలుగు రోజుల‌కే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం మ‌రో స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించటంతో ప్ర‌త్యేక హోదా అంశంపై మ‌రోసారి చ‌ర్చ‌కు తెర తీసిన‌ట్లైంది.

ఇదిలా ఉంటే.. తాజాగా వైఎస్ జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న యువ‌భేరీ కార్య‌క్ర‌మం కర్నూలులో జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక‌హోదా అంశాన్ని పార్టీ నేత‌లు ప్ర‌స్తావించి.. దాని మీద త‌మ అధినేత జ‌గ‌న్ కు ఉన్న‌క‌మిట్ మెంట్ గురించి గొప్ప‌లు చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. త‌మ అధినేత ప్ర‌త్యేక హోదా విష‌యంలో క‌మిట్ మెంట్ తో ప‌ని చేస్తున్న‌ట్లుగా చెప్పారు. జ‌గ‌న్ మార్గ‌ద‌ర్శ‌నంలో తాను న‌డవ‌నున్న‌ట్లుగా చెప్పిన ఆమె.. రాష్ట్రం యావ‌త్తూ ప్ర‌త్యేక హోదాను కోరుకుంటుంద‌ని వ్యాఖ్యానించారు. కానీ.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు భిన్నంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు మాత్రం త‌మ ప్ర‌యోజ‌నాల కోసం పాకులాడుతుంద‌ని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న బుట్టా రేణుక‌.. ఈ సంద‌ర్భంగా ఒక ఆస‌క్తిక‌ర వాద‌న‌ను వినిపించారు. ప్ర‌త్యేక హోదా కోసం తాము ఎలాంటి త్యాగాల‌కైనా సిద్ధంగా ఉన్న‌ట్లుగా చెప్పిన ఆమె.. త‌మ అధినేత ఆదేశిస్తే.. త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. త‌మ రాజీనామాల వ‌ల్ల ప్ర‌త్యేక‌హోదా వ‌స్తుంద‌నుకుంటే తాము త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌టానికైనా సిద్ధ‌మ‌ని ఆమె ప్ర‌క‌టించారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ప్ర‌త్యేక హోదా అంశంపై ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌నున్నాయ‌న్న విష‌యాన్ని బుట్టా రేణుక త‌న మాట‌ల్లో చెప్ప‌క‌నే చెప్పింద‌ని చెప్పాలి.