Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కొత్త పేరు బ‌ట‌న్ మోహ‌న్ రెడ్డా?

By:  Tupaki Desk   |   19 July 2022 10:52 AM GMT
జ‌గ‌న్ కొత్త పేరు బ‌ట‌న్ మోహ‌న్ రెడ్డా?
X
2019 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నుంచి ఎంపీగా గెలిచారు.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. వైఎస్సార్సీపీ త‌ర‌పున గెలిచిన ఆయ‌న అప్ప‌టి నుంచి ఆ పార్టీ రెబ‌ల్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వివిధ అంశాల్లో జగ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మ‌రోవైపు వైఎస్సార్సీపీ నేత‌లు కూడా ఆయ‌న‌పై అంతే స్థాయిలో మండిప‌డుతున్నారు. ద‌మ్ముంటే రాజీనామా చేసి గెల‌వాల‌ని స‌వాళ్లు విసురుతున్నారు. ఇటీవ‌ల భీమ‌వ‌రంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న‌లో స్థానిక ఎంపీగా పాల్గొందామ‌ని చివ‌రి నిమిషం వ‌ర‌కు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌భుత్వం వ‌మ్ము చేసింది.

ఈ నేప‌థ్యంలో అప్ప‌టి నుంచి సీఎం వైఎస్ జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు.. ఎంపీ ర‌ఘురామ‌. తాజాగా మ‌రోమారు సీఎం జ‌గ‌న్ పై సెటైర్లు వేశారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. బ‌ట‌న్ మోహ‌న్ రెడ్డిగా మారార‌ని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిధులను లబ్ధిదారులకు బదిలీ చేయడానికి బటన్‌ను నొక్కడమే తన పని అని జగన్ జూలై 18న జ‌రిగిన ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశంలో వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే రఘురామరాజు జగన్‌ను బ‌ట‌న్ మోహ‌న్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

అలాగే ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతుల లేమితో ఇబ్బంది పడుతున్నాయని ర‌ఘురామ స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తారు. ప్రభుత్వం అనేక పాఠశాలలను మూసివేస్తోందని మండిప‌డ్డారు. విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని సీఎం జగన్‌ను కోరారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శక్తిహీనుడని ర‌ఘురామ అంటున్నారు.

విద్యార్థులకు నాసిరకం సౌక‌ర్యాలు అందిస్తున్నార‌ని ఎంపీ ర‌ఘురామ‌ ఆరోపించారు. దీనికి మంత్రి బొత్స‌, విద్యాశాఖలోని అధికారులు, సీఎం జగన్ కారణమని ర‌ఘురామ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. విలీనం పేరుతో చాలా పాఠశాలల‌ను మూసివేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించాల్సి వస్తోందని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని ర‌ఘురామ తేల్చిచెప్పారు.

కోడిక‌త్తి కేసును, వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును సీబీఐ, ఎన్ఐఏ స‌రిగా ద‌ర్యాప్తు చేయ‌డం లేద‌ని ర‌ఘురామ మండిప‌డ్డారు. ఈ రెండు కేసుల విచార‌ణ‌ల్లో తీవ్ర జాప్యం జ‌రుగుతోంద‌న్నారు.

కాగా ఎంపీ రఘురామరాజు జగన్‌కి కొత్త పేరు పెట్టడంతో ఈ బటన్ రెడ్డి అనే పదం సోషల్‌ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌తిప‌క్ష పార్టీల కార్య‌క‌ర్త‌లు ఈ హ్యాష్ ట్యాగుతో సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ నేత‌లు ర‌ఘురామ‌పై ఎలా విరుచుకుప‌డ‌తారో వేచిచూడాల్సిందే.