Begin typing your search above and press return to search.

యూఎస్ రిపోర్టుపై మాధవ్ కౌంటర్.. బాబు ఆడియోను అమెరికా ల్యాబ్ కు పంపాలి

By:  Tupaki Desk   |   15 Aug 2022 12:30 AM GMT
యూఎస్ రిపోర్టుపై మాధవ్ కౌంటర్.. బాబు ఆడియోను అమెరికా ల్యాబ్ కు పంపాలి
X
బూతు వీడియో ఎపిసోడ్ కొనసా..గుతోంది. రోజుల తరబడి ఒకే అంశం హాట్ టాపిక్ గా.. ఏపీ రాజకీయాల్లో రచ్చ రచ్చగా మారటం ఇదే అంటున్నారు. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన అశ్లీల వీడియోగా చెప్పే దానిపై గడిచిన కొద్ది రోజులుగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. అది ఫేక్ వీడియో అని గోరంట్ల స్పష్టం చేస్తుంటే.. ఆ వీడియోను తాము అమెరికాలోని ల్యాబ్ కు పంపామని.. అందులో అది ఒరిజినల్ అన్నది తేలిందంటూ తెలుగు తమ్ముడు శనివారం నివేదికను విడుదల చేయటం తెలిసిందే.

దీనిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతూ.. చంద్రబాబు అండ్ కోపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వీడియో విడుదల తర్వాత తొలిసారి అనంతపురం జిల్లాకు ఈ రోజు (ఆదివారం) వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద భారీగా చేరిన వైసీపీ కార్యకర్తలు.. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ బూతు వీడియో ఎపిసోడ్ లో ఆయన ఇమేజ్ దెబ్బతిందన్న వాదనకు భిన్నంగా సందడి నెలకొనటం ఆసక్తికరంగా మారింది. బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న ఆలయంలో గోరంట్ల మాధవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

తన వీడియో ఒరిజినల్ అని.. అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని టీడీపీ నేతలు చెప్పటం వింతగా ఉందన్నారు. తన వీడియోను ఫేక్ అని పోలీసులు నిర్దారించారని.. అలాంటప్పుడు ఈ తప్పుడు ప్రచారం ఏమిటంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలే ఖాకీ యూనిఫాం వేసుకున్న పోలీసుల మాదిరి.. జడ్జిల మాదిరి.. సైంటిస్టుల మాదిరి తీర్పులు.. ఉత్తర్వులు ఇస్తున్నారన్న ఆయన.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో టేప్ ను కూడా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలన్నారు.

చంద్రబాబు ఆడియోను అమెరికా ల్యాబ్ కు పంపి పరీక్ష చేయిస్తే.. తాను కూడా తన వీడియోను దర్యాప్తు చేయించేందుకు సిద్ధమవుతానని పేర్కొన్నారు. అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు చంద్రబాబు ఓటుకు నోటు ఆడియో పరీక్ష చేయించి.. అతి తప్పుదని నిరూపిస్తారా? అంటూ సవాలు విసిరారు. మరి.. గోరంట్ల మాధవ్ పేర్కొన్నట్లు చంద్రబాబు ఆడియో టేప్ ను అమెరికా ల్యాబ్ లో పరీక్షకు పంపుతారా? అన్న ప్రశ్నకు తెలుగు తమ్ముళ్లు ఏ విధంగా సమాధానం ఇస్తారో?