Begin typing your search above and press return to search.

అరెస్టు చేసేందుకు ప్లాన్.. వేట మొదలైంది: ఎంపీ రఘురామ

By:  Tupaki Desk   |   27 Feb 2022 4:48 AM GMT
అరెస్టు చేసేందుకు ప్లాన్.. వేట మొదలైంది: ఎంపీ రఘురామ
X
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తన ఊరికి వెళ్లేందుకు ప్లానింగ్ చేసుకున్న ఆయన.. తన పుట్టిన రోజు వేడుకల కోసం హైదరాబాద్ కు రావటం.. ఆయన్ను అరెస్టు చేసి ఏపీకి తరలించటం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఎంత సంచలనంగా మారాయో తెలిసిందే. పోలీస్ కస్టడీలో తనపై దాడి జరిగిందని.. పోలీసులు తనపై భౌతికదాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు చేయటం తెలిసిందే.

తాజాగా నేతాజీ పుస్కకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనటానికి హైదరాబాద్ వచ్చిన ఆయన.. మరోసారి రాజకీయ సంచలనంగా మారారు. చాలా రోజుల తర్వాత తాను హైదరాబాద్ వస్తే.. తనపై వేట మళ్లీ మొదలైందని.. తన మీద నిఘా పెట్టారని.. ఏపీకి చెందిన ఏఎస్సై రామకృష్ణారెడ్డి తన నివాసం ముందు అనుమానాస్పదంగా తిరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను గట్టిగా ప్రశ్నిస్తే.. మరికొద్ది గంటల్లో అరెస్టు చేసేందుకుప్లాన చేస్తున్నట్లుగా చెప్పారన్నారు.

పెగాసిస్ కంటే దారుణంగా.. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా తన మీద నిఘా పెడుతున్నారన్నారు. తన మీద నిఘా పెడుతున్న ఈ తుచ్చ రాజకీయ నాయకుల్ని ఏం చేయాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్న ఆయన.. సదరు పోలీసు అధికారి చెప్పిన దాని ప్రకారం.. రెండు రోజులుగా తన మీద నిఘా పెట్టినట్లుగా తెలిపారని రఘురామ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను గచ్చి బౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

తన ఇంటి ముందు పోలీసులు నిఘా పెట్టిన వైనానికి సంబంధించిన ఫోటోల్ని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పంపినట్లు చెప్పారు. తెలంగాణలో ఆంధ్రా పోలీసులు తిరిగేందుకు ఎందుకు అనుమతిని ఇస్తున్నారని నిలదీసిన ఆయన.. తెలంగాణ పోలీసుల అనుమతి లేకుండానే వారు తిరుగుతున్నారా? అని ప్రశ్నించారు.

తనకు కోర్టులోనూ.. ప్రివిలేజ్ కమిటీలోనూ న్యాయం జరిగినా జరగకున్నా.. తాను మాత్రం చివరి వరకు అన్ని వివరాల్ని ప్రజల ముందు ఉంచుతానని పేర్కొన్నారు. ఇంతకూ రఘురామ అంచనా వేసినట్లే.. ఆయన్ను గంటల వ్యవధిలో ఏపీ పోలీసులు అరెస్టు చేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.