Begin typing your search above and press return to search.

మళ్ళీ నర్సాపురం నుంచే... ఆ పార్టీ తరఫున రఘురామ‌ పోటీ...?

By:  Tupaki Desk   |   19 Jun 2022 4:30 AM GMT
మళ్ళీ నర్సాపురం నుంచే... ఆ పార్టీ తరఫున రఘురామ‌ పోటీ...?
X
వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు చాలా కాలానికి తన మనసు విప్పి మాట్లాడారు. ఒక యూ ట్యూబ్ చానల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్యూలో కూల్ గా చాలా విషయాలు చెప్పారు. ఒక విధంగా ఢిల్లీలో పాత్రికేయులతో రచ్చబండలో మాట్లాడినపుడు రాజు గారు చాలా ఆవేశంగా కనిపిస్తారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా అక్కడ వేరుగా ఉంటుంది. కానీ ఈ ఇంటర్వ్యూలో మాత్రం ఎలాంటి ప్రశ్న వేసినా చాలా చక్కగా చెప్పారు. బ్యాలన్స్డ్ గా ఆయన వ్యవహరించారు.

ఇక రాజు గారికి ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కూడా చాలా వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గురించి కూడా ఆయన సెటైరికల్ గా ఆన్స‌ర్ ఇచ్చారు. ఏపీలో అభివృద్ధి అన్నదే లేదు, అరాచకం తప్ప అని తన మార్క్ డైలాగ్ పేల్చారు. వైసీపీ పాలన మీద ఇంకా విపక్షాలు గట్టిగా విమర్శలు చేయడంలేదన్న భావనను వెలిబుచ్చారు.

ఇక ఎంపీగా నెగ్గిన తాను ఎందుకు రాజీనామా చేయాలీ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తన అనర్హత పిటిషన్ మీద ఏమీ చేయలేని వైసీపీ వారే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ చేశారు. అలాగే తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు.

తాను రాజీనామా చేస్తే చంపేస్తారు అని కూడా ఒక సంచలన కమెంట్ చేశారు. ఎందుకు చంపేస్తారు ఎవరు చంపేస్తారు అన్నది చెప్పకపోయినా తాను పోరాటంలో ఉన్నాను కాబట్టి ఎంపీ పదవి తనకు రక్షణ కవచం అని చెప్పుకున్నారు. తాను ఎంపీగా ఎందుకు నెగ్గానా ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానా అన్న భావన గతంలో ఉండేదని, తనకు ఎపుడైతే పోలీసులతో కొట్టించారో నాటి నుంచి కసి పెరిగి ఇంకా రాజకీయాల్లో కొనసాగాలనిపిస్తోందని రాజు గారు చెప్పారు.

మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నర్శాపురం నుంచి పోటీ చేసి తీరుతాను అని ఆయన బల్ల గుద్ది చెప్పారు. ఏ పార్టీ అన్నది అప్పటి పరిస్థితుల బట్టి ప్రకటిస్తాను అని ఆయన సస్పెన్స్ లో ఉంచారు. పొత్తుల వ్యవహారం కూడా తేలాలి కదా అని ఆయన అనడం విశేషం. బీజేపీ టీడీపీల మధ్య చెలిమి కోసం తన వంతుగా ప్రయత్నం చేస్తాను అని ఆయన చెప్పడం కూడా గమనార్హం.

టీడీపీ భావి నాయకుడు లోకేష్ ఉన్నత విద్యావంతుడని, సీనియర్ నేతల పట్ల మంచి గౌరవం చూపిస్తారని రాజు గారు పొగడం విశేషం. అంతే కాదు భవిష్యత్తుతో మంచి నాయకుడిగా లోకేష్ ఉంటారని కూడా రాజు గారు జోస్యం చెప్పారు.

తన వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు తనకు రాజకీయ సలహాలు ఎపుడూ ఇవ్వరని రాజు చెప్పారు. అయితే ఒకసారి ఆయన ఇచ్చిన సలహా పాటించకపోవడం వల్లనే తాను ఈ రోజు ఇబ్బందులు పడుతున్నాన‌ని అ ఆయన చెప్పారు. తాను వైసీపీలో చేరుతున్నట్లుగా కేవీపీతో చెబితే అక్కడ తాను ఇమడలేను అని కేవీపీ చెప్పారని, నాడు ఆయన మాటను పక్కన పెట్టానని, ఇపుడు అదే బాధను తాను పడుతున్నాను అని రాజు గారు ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చారు.

అలాగే ఏపీలో వైసీపీ సర్కార్ ని విమర్శిస్తూ బీజేపీ జనసేన టీడీపీల మీద తన అభిమానం దాచుకోకుండా బయటపెట్టుకున్న రాజు గారు తన ఫ్యూచర్ ప్లాన్స్ తో పాటు పొలిటికల్ రూట్ ఏంటో చెప్పేశారు. ఇక తన వ్యక్తిగత అభిరుచులు గురించి చెబుతూ తాను మంచి భోజన ప్రియుడిని అని ఆయన అన్నారు. తాను ఎపుడూ చుట్టూ నలుగురైదుగురు లేకుండా భోజనమే చేయనని, అన్ని రకాలైన వంటలతో కూడిన భోజనాలు తన ఇంటి నుంచే వస్తాయని చెప్పారు.

ఇక తనకు క్రికెట్ అంటే చిరాకు అని వరల్డ్ కప్ అయినా చూడను అని తెగేసి చెప్పేశారు. గోల్ఫ్ తనకు ఇష్టమని, ఈ మధ్య దాకా ఆడేవాడినని, ఇక హైదరాబాద్ ఇపుడు జగన్ సర్కార్ దయ వల్ల రావడం తగ్గించేశానని, ఢిల్లీలో ఆడడం వీలుపడడంలేదని అన్నారు. సినిమాలు రాజకీయాలు తనకు ఇష్టమైన రంగాలు అని మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ తన ఫేవరేట్ హీరో అని, ఆయన మంచి నటుడని, అంతకంటే మంచి మనిషి అని కూడా రాజు గారు కితాబు ఇచ్చారు.