Begin typing your search above and press return to search.

ఎంపీ ర‌ఘురామ హెలికాఫ్ట‌ర్ ల్యాండ్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   3 July 2022 12:52 AM GMT
ఎంపీ ర‌ఘురామ హెలికాఫ్ట‌ర్ ల్యాండ్ అయ్యేనా?
X
న‌ర‌సాపురం వైఎస్సార్సీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఏపీ హైకోర్టులో ర‌క‌ర‌కాల అంశాల‌పై ఎంపీ ర‌ఘురామ వ‌రుస‌గా పిటిష‌న్లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు.

జూలై 4న‌ ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించనున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స్థానిక ఎంపీగా ఉన్న ర‌ఘురామ‌కృష్ణరాజు ఆ ప‌ర్య‌ట‌న‌కు హాజ‌రుకావ‌డానికి స‌క‌ల శ‌క్తులు ఒడ్డుతున్నారు. తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌స్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏదో ఒక కేసులో త‌న‌ను అరెస్టు చేస్తుంద‌ని భావిస్తున్న ఎంపీ ర‌ఘురామ హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌ను అరెస్టు చేయ‌కుండా ఇప్ప‌టికే ఉత్త‌ర్వులు తెచ్చుకున్నారు .అలాగే త‌న‌కు వైఎస్సార్సీపీ గూండాల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని.. భ‌ద్రత క‌ల్పించాల‌ని కోర‌గా.. ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న వ‌ర‌కు.. అంటే రెండు రోజుల‌పాటు ఆయ‌న‌కు జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మ‌రోమారు హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన‌డానికి వీలుగా త‌న హెలికాప్ట‌ర్ ల్యాండ్ అయ్యేందుకు అనుమ‌తించాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఎంపీ పర్యటనలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని/ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఎస్పీకి స్పష్టం చేసింది.

అయితే హెలికాప్టర్‌ దిగేందుకు భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం అనుమతి ఇవ్వలేదని, దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం మొదట ఆమోదం తెలిపినా తర్వాత వెనక్కి తీసుకుందని హైకోర్టు గుర్తు చేసింది. హెలికాప్టర్‌ దిగేందుకు అనుమతిచ్చేలా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించలేమని పేర్కొంది. ఎంపీ రఘురామకు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచినందున రాష్ట్ర పోలీసులూ రక్షణ ఇవ్వాలంటూ ఆదేశించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అయితే ఎంపీ జూన్ 17నే హెలికాప్ట‌ర్ ల్యాండింగ్ కు అనుమ‌తి ఇవ్వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నా జిల్లా కలెక్టర్‌ తగిన ఉత్తర్వులు జారీ చేయకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు.