Begin typing your search above and press return to search.

వైఎస్సార్ నాటి డైలాగుతో ర‌ఘురామ సెటైర్లు!

By:  Tupaki Desk   |   10 July 2022 10:00 AM GMT
వైఎస్సార్ నాటి డైలాగుతో ర‌ఘురామ సెటైర్లు!
X
2019 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నుంచి ఎంపీగా గెలిచారు.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. వైఎస్సార్సీపీ త‌ర‌పున గెలిచిన ఆయ‌న అప్ప‌టి నుంచి రెబ‌ల్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వివిధ అంశాల్లో జగ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మ‌రోవైపు వైఎస్సార్సీపీ నేత‌లు కూడా ఆయ‌న‌పై అంతే స్థాయిలో మండిప‌డుతున్నారు. ద‌మ్ముంటే రాజీనామా చేసి గెల‌వాల‌ని స‌వాళ్లు విసురుతున్నారు. ఇటీవ‌ల భీమ‌వ‌రంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న‌లో స్థానిక ఎంపీగా పాల్గొందామ‌ని చివ‌రి నిమిషం వ‌ర‌కు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌భుత్వం వ‌మ్ము చేసింది. తాజాగా జూలై 8, 9 తేదీల్లో జ‌రిగిన వైఎస్సార్సీపీ ప్లీన‌రీకి ర‌ఘురామ‌కు ప్ర‌వేశం లేక‌పోవ‌డంతో హాజ‌రు కాలేక‌పోయారు.

దీంతో మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్ పైన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సెటైర్లు వేశారు. డిస్టింక్షన్‌ కుర్రాడు మీటింగు పెడితే విపరీతంగా జనం వస్తారని అనుకున్నాన‌ని.. తానుకూడా ప్లీన‌రీకి వెళ్లాలని అనుకున్నాన‌ని చెప్పారు. అయితే ఆంధ్రాకు వెళ్లడానికి త‌న‌కు వీసా లేద‌ని.. అందుకే వెళ్లలేక‌పోయాన‌ని సెటైర్లు వేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్లీనరీ మొద‌టి రోజు సమావేశానికి హాజ‌రయ్యేందుకు రెండున్నర లక్షల మందికి ఏర్పాట్లు చేశామని వైఎస్సార్సీపీ నాయకులు చెప్పుకున్నార‌ని గుర్తు చేశారు. అయితే వేలల్లో మాత్రమే భోజనాలు చేసినట్లుగా త‌న‌కు తెలిసింద‌ని తెలిపారు.

ఫుడ్ మెనూ ముందుగానే ప్రకటించక పోయి ఉంటే.. వారు కూడా వచ్చి ఉండేవారు కాదేమో? అని ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ అధ్యక్షుడు జగ‌న్ మోహ‌న్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాల్గొన్న సభకే జనం రాకపోతే.. పార్టీ పరిస్థితి ఏమిటో ఊహించుకుంటేనే భయం వేస్తోంద‌ని ఎద్దేవా చేశారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉండడానికి జగన్‌ ప్లీనరీలో చెప్పిన కారణమే నిజమైతే.. వైఎస్సార్సీపీ రానున్న ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలమే పరిమితమవుతుందని ర‌ఘురామ హాట్ కామెంట్స్ చేశారు.

కాగా గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు తెలంగాణ ఉద్య‌మం పీక్ స్టేజులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో 2009 ఎన్నిక‌లకు ముందు తెలంగాణ‌కు వెళ్లాలంటే ఆంధ్రా వాళ్లు వీసా తీసుకోవాల్సి వ‌స్తుందంటూ ముఖ్య‌మంత్రి హోదాలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోమారు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఆంధ్రా వెళ్ల‌డానికి త‌న‌కు వీసా దొర‌క‌లేదంటూ వ్యాఖ్యానించి నాడు వైఎస్సార్ అన్న డైలాగును గుర్తు చేశారు.