Begin typing your search above and press return to search.

చివరి నిముషంలో అరెస్ట్ ని తప్పించుకున్న వైసీపీ ఎంపీ...?

By:  Tupaki Desk   |   23 Oct 2022 12:23 PM GMT
చివరి నిముషంలో అరెస్ట్ ని తప్పించుకున్న వైసీపీ ఎంపీ...?
X
ఆయన గతంలో ఎంతలా పాపులరో తెలియదు కానీ వైసీపీ ఎంపీగా గత మూడున్నరేళ్ళుగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్తు దేశానికి సుపరిచితం అయిపోయారు. ఆయన పేరు మీడియాలో మారు మోరని రోజంటూ ఉండదు, ఆయనే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామా కృష్ణం రాజు. ఇక ఆయన ఢిల్లీలో రచ్చ బండ పేరిట ఏపీ సర్కార్ మీద విమర్శలు ఎక్కుపెట్టడంలో తనకు సరిసాటి లేదనిపించుకున్నారు. అయితే ఆయన మీద ఏపీ సీఐడీ విభాగం పలు కేసులు పెట్టింది.

అప్పట్లో ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టి హైదరాబాద్‌లో సీఐడీ అరెస్టు చేసింది. సీఐడీ కస్టడీలో పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని రఘురామ ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో కూడా దాన్ని నిరూపించారు. అప్పటి నుంచి ఆయనను ప్రభుత్వం సొంత నియోజకవర్గంలోకి అనుమతించడం లేదు. అలా ఆయనను అరెస్ట్ చేయాలని గతంలో ప్రయత్నించి అరెస్ట్ చేసి మరీ భంగపడింది. చివరికి బెయిల్ మీద బయటకు వచ్చిన రఘురామరాజు తనకు ఏపీ సీఐడీ పోలీసులు చిత్ర హింసలు ఎలా రిమాండ్ లో పెట్టింది అన్న దాని మీద నేరుగా స్పీకర్ కే ఫిర్యాదు చేశారు.

ఇలా ఆయన మీద అనేక కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ఏపీసీఐడీ చూస్తూండడంతో ఆయన ఏపీకి రావడం మానుకున్నారు. అలాగే తనను గెలిపించిన సొంత సీటు నర్సాపురానికి కూడా రావడం మానుకున్నారు. వీలు దొరికితే ఆయన హైదరాబాద్ కి వచ్చి వెళ్తున్నారు. అయితే హైదరాబాద్ లో కూడా రఘురామను ఎలాగైనా అరెస్ట్ చేయాలని ఎపీ సీఐడీ చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికపుడు వమ్ము అవుతున్నాయి.

అయితే లేటెస్ట్ గా అంటే ఈ శనివారం రఘురామ హైదరాబాద్ రావడంతో ఆయనను అరెస్ట్ చేయడానికి ఏపీ సీఐడీ గట్టిగానే ప్రయత్నం చేసింది అని అంటున్నారు. అయితే దీనిని ఆఖరు నిముషంలో పసిగట్టిన రఘురామ ఎలాగోలా తప్పించుకుని ఢిల్లీకు చేరుకున్నారు అని అంటున్నారు.

మరి రఘురామను ఏ కేసు విషయంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేయాలనుకున్నారో తెలియదు కానీ ఆయనను అరెస్ట్ చేయాలనుకున్న వ్యవహారం బయటకు పొక్కింది. దాంతో మళ్ళీ దీని మీదనే ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మొత్తానికి ఎంపీ గారు సేఫ్ జోన్ అనుకుని ఢిల్లీకే వెళ్ళిపోయారని అంటున్నారు.