Begin typing your search above and press return to search.

ఈ సెంటిమెంటు అరిగిపోయింది ర‌ఘురామ‌య్యా..?

By:  Tupaki Desk   |   19 Dec 2022 1:30 AM GMT
ఈ సెంటిమెంటు అరిగిపోయింది ర‌ఘురామ‌య్యా..?
X
ఔను.. రాజ‌కీయాల్లో సెంటిమెంట్ల‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నాయ‌కులు.. ప్ర‌జ‌ల మూడ్‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు సెంటిమెంటు అస్త్రాల‌ను ప్ర‌యోగిస్తారు. చాలా సార్లు ఈ సెంటిమెంట్లు వ‌ర్క‌వుట్ అవుతాయి. కొన్ని కొన్ని సార్లు మాత్రం వీగిపోతాయి. అయితే.. న‌ర‌సాపురం వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఒకే సెంటిమెంటును అరిగిపోయిన రికార్డు మాదిరిగా ప‌దేప‌దేవ‌ల్లెవేస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న కోరుకున్న‌ట్టు ఈ సెంటిమెంటు వ‌ర్క‌వుట్ అవుతోందా? అనే చ‌ర్చ‌.

విష‌యం ఏంటంటే.. త‌న‌ను సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌.. హైద‌రాబాద్లోని త‌న ఇంటి నుంచి బ‌ల‌వంతంగా లాక్కువెళ్లి.. జీపులో సీటుపై కూడా కూర్చోబెట్ట‌కుండా.. కాళ్లు పెట్టుకునే చోట కూర్చోబెట్టి.. స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అంతేకాదు.. త‌న కాళ్లు రెంటినీ క‌ట్టేసి.. సునీల్ డైరెక్ష‌న్‌లో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు సీఐడీ కానిస్టేబుళ్ల‌తో చితక్కొట్టించారు.

అంతేకాదు.. ఇలా కొడుతున్న స‌మ‌యంలో సునీల్ స్వ‌యంగా దీనిని వీడియోలో లైవ్ చూపిస్తే.. సీఎం జ‌గ‌న్ దానిని చూసి, కొడుతున్న స‌మ‌యంలో ర‌ఘురామ అరుపులు, ఏడుపులు విని ఆనందించారు. ఇదీ క‌థ‌! ఇది నిజ‌మ‌నే అనుకుందాం(ఇక్క‌డ చిన్న స‌వ‌ర‌ణ ఏంటంటే.. ఇది కొట్టిన దెబ్బ‌లు కావ‌ని, ఎడిమా అనే అరికాళ్ల వ్యాధి కార‌ణంగా పుళ్లు ప‌డ్డాయ‌ని హైద‌రాబాద్‌లోని సైనిక ఆసుప‌త్రి రిపోర్టులు సుప్రీంకోర్టుకు చేరాయి. దీనిని కూడా ర‌ఘురామ త‌ప్పుప‌ట్టారు అది వేరే విష‌యం)

అయితే,  ఈ సెంటిమెంటును ఆయ‌న ప‌దే ప‌దే ప్లే చేస్తున్నారు. దీనివ‌ల్ల త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తాను ఒంట‌రిగా పోటీ చేసినా.. భ‌విష్య‌త్తులో మ‌రో పార్టీ టికెట్‌పై పోటీ చేసినా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అనుకుంటున్నారు. కానీ, వాస్త‌వానికి ఇప్పుడు ఈ సెంటిమెంటును ప్ర‌జ‌లు న‌వ్వి వ‌దిలేస్తున్నారు. అంతేకాదు.. ``ఆయ‌న ఏ త‌ప్పు చేయ‌కుండా సీఐడీ పోలీసులు ఎందుకు తీసుకువెళ్తారు`` అని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సో.. ఇక‌నైనా ర‌ఘురామ దీనిని వ‌దిలేసి.. అభివృద్ధి ఏదైనా చేసి ఉంటే అది చెప్పుకొంటే ఫ‌లితం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.