Begin typing your search above and press return to search.

ఢిల్లీ మ‌ద్యం.. ఆ వైఎస్సార్సీపీ ఎంపీ పాత్ర ఏమిటి?

By:  Tupaki Desk   |   3 Aug 2022 9:39 AM GMT
ఢిల్లీ మ‌ద్యం.. ఆ వైఎస్సార్సీపీ ఎంపీ పాత్ర ఏమిటి?
X
మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి వివాద‌ర‌హితుడు. అన్ని పార్టీల నేత‌ల‌తోనూ ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినీ రంగానికి చెందిన పెద్ద హీరోల‌తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఒంగోలు ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఒంగోలు ఎంపీగా ఆయ‌న వైఎస్సార్సీపీ త‌ర‌ఫున గెలుపొందారు.

అయితే ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఢిల్లీ మ‌ద్యం విధానంలో మాగుంట శ్రీనివాసుల‌రెడ్డికి చెందిన కంపెనీ ఉందంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఢిల్లీలో అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్ర‌భుత్వం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆప్ ప్ర‌భుత్వ మ‌ద్యం విధానంపై ప్ర‌తిప‌క్ష బీజేపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది.

ఆప్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో కొన్ని మ‌ద్యం కంపెనీల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగింద‌నేది బీజేపీ విమ‌ర్శ‌. ఈ కంపెనీల్లో మాగుంట శ్రీనివాసుల‌రెడ్డికి చెందిన కంపెనీ కూడా ఉంద‌ని అంటున్నారు.

గ‌తేడాది నవంబర్ నుంచి ఢిల్లీలో కొత్త మ‌ద్యం విధానం అమ‌ల్లోకి వ‌చ్చింది. మద్యం విక్రయాల బాధ్యత నుంచి ఆప్ ప్రభుత్వం తప్పుకొని ఆ ప‌నిని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. మద్యం మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం కోస‌మే కొత్త మ‌ద్యం విధానాన్ని తీసుకొచ్చామ‌ని కేజ్రీవాల్ ప్ర‌భుత్వం చెబుతోంది.

మ‌ద్యం వినియోగ‌దారులు ఒక‌టి కొంటే మ‌రొక బాటిల్ ను ఉచితంగా ఇస్తుండ‌టంతో మ‌ద్యం విక్ర‌యాలు పెరిగాయి. అంతేకాకుండా ఎంఆర్పీ రేటు కంటే త‌క్కువ‌కే అమ్ముతున్నారు. దీంతో ప్ర‌భుత్వానికి కూడా మంచి ఆదాయం వ‌స్తోంది.

అయితే, ఎక్సైజ్ టెండర్ల కేటాయింపు, డిస్కౌంట్లు అందించే ప్రక్రియలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని బీజేపీ ఆరోపిస్తోంది. బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీలను టెండర్ ప్రక్రియలో ఎలా అనుమతించారని బీజేపీ నిల‌దీస్తోంది. ఖావో గాలి అనే కంపెనీ బ్లాకు లిస్టులో ఉంద‌ని.. ఇది మాగుంట శ్రీనివాసుల‌రెడ్డికి చెందిన కంపెనీతో క‌లసి సిండికేటుగా ఏర్ప‌డింద‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు.

బ్లాకు లిస్టులో ఉన్న కంపెనీకి టెండ‌ర్ల‌లో అవ‌కాశ‌మివ్వ‌డం ఒక త‌ప్ప‌యితే.. సిండికేటు అవ్వ‌డానికి అనుమ‌తించ‌డం మ‌రో త‌ప్ప‌ని చెబుతున్నారు. నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ఇందుకు అనుమ‌తిచ్చింద‌ని ఢిల్లీ బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇందుకు పెద్ద మొత్తంలో చేతులు మారాయని.. అందుకే అనుమ‌తులు ఇచ్చార‌ని అంటున్నారు. దాదాపు రూ.144 కోట్ల ఆప్ పొందింద‌ని బీజేపీ విమ‌ర్శిస్తోంది.

అలాగే లిక్కర్ లైసెన్సు కోసం డిపాజిట్ చేసిన బిడ్డర్‌కు రూ.30 కోట్లను మంత్రిమండ‌లి ఆమోదం లేకుండా తిరిగి ఇవ్వ‌డం కూడా అనుమానాల‌కు తావిచ్చేలా ఉంద‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌తో కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ఈ మ‌ద్యం విధానాన్ని ప‌క్క‌న పెడుతున్నామ‌ని ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 1 నుంచి ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే విక్ర‌యాలు చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేసింది.

మ‌రోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా రంగంలోకి వచ్చారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశాలు ఇవ్వ‌డంతో ఈ వ్య‌వ‌హారం ముదిరి పాకాన ప‌డుతోంది. అలాగే దీనిపై పూర్తి నివేదిక‌ను త‌నకు స‌మ‌ర్పించాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని స‌క్సేనా ఆదేశించారు.

కాగా బీజేపీ నేత‌ల ఆరోప‌ణ‌ల‌ను మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి ఖండించారు. స‌క్ర‌మ ప‌ద్ధ‌తుల్లోనే పార‌దర్శ‌కంగా త‌మ కంపెనీ టెండ‌ర్ వేసింద‌ని.. ఎలాంటి అక్ర‌మాలు జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న చెబుతున్నారు. త‌న కంపెనీపై ఆరోప‌ణ‌లు చేసిన బీజేపీ నేత మీనాక్షి లేఖికి ఈ విష‌యంపై వివ‌ర‌ణ కూడా ఇచ్చాన‌ని మాగుంట పేర్కొంటున్నారు.