Begin typing your search above and press return to search.

కాశ్మీర్ విషయంలో కేంద్రానికి వైసీపీ మద్దతు!

By:  Tupaki Desk   |   5 Aug 2019 8:05 AM GMT
కాశ్మీర్ విషయంలో కేంద్రానికి వైసీపీ మద్దతు!
X
జమ్ము కశ్మీర్ విభజన - ఆర్టికల్ 370 రద్దు కోసం రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు ఆంధ్రప్రదేశ్‌ లోని పాలక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. సభలో ఈ బిల్లులపై చర్చ సందర్భంగా ఆ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ విషయంలో కేంద్రానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.

దేశంలో ఒక రాష్ట్రంగా ఉన్న జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక జెండా ఎందుకు.. వారికి ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకు... పాకిస్తానీలు కశ్మీరీ అమ్మాయిలను పెళ్లాడి భారతీయులుగా మారడం దేశ భద్రతకు ప్రమాదకరం కాదా... కశ్మీర్‌లో స్థానికేతరులెవరూ ఆస్తులు కొనకూడదు, ఉద్యోగాలు చేయకూడదు అంటూ ఆర్టికల్ 370 - 35ఏలు వారికి హక్కులు కల్పిస్తే దేశంలోని ఇతర ప్రాంతాల వారిని వేరుగా చూస్తున్నట్లు కాదా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.

అంతేకాదు.. ఆర్టికల్ 35ఏ ప్రకారం జమ్ముకశ్మీరీ అమ్మాయి ఎవరైనా దేశంలోని ఇతర రాష్ట్రాల పురుపులను పెళ్లాడితే ఆమెకు అక్కడి శాశ్వత నివాస హోదా పోవడం.. అక్కడ ఆస్తి హక్కు పోవడం.. ఆమె పిల్లలు అక్కడ చదువుకోవడానికి - ఉద్యోగాలు చేయడానికి అవకాశం పోవడం.. తాతల నుంచి వచ్చే ఆస్తులనూ పొందలేకపోవడం వంటివన్నీ మహిళలకు జరుగుతున్న అన్యాయంకాదా అని ఆయన ప్రశ్నించారు.

ఇలాంటి అన్యాయాలన్నిటినీ రూపుమాపేలా కేంద్రం హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు.

కాగా కొద్దిరోజుల కిందట రాజ్యసభలో సమాచార హక్కు సవరణ బిల్లు విషయంలో కేంద్రంతో విభేదించిన వైసీపీ ఇప్పుడు ఈ విషయంలో కేంద్రానికి మద్దతు పలకడం ఆసక్తి రేపింది. అయితే, దేశ సమగ్రత - ఏకత్వానికి సంబంధించిన అంశం కావడంతో వైసీపీ రెండో ఆలోచన లేకుండా మద్దతు పలికినట్లు తెలుస్తోంది.