Begin typing your search above and press return to search.

ఢిల్లీలో బాబు!.. మ‌రో యూట‌ర్నేనా!

By:  Tupaki Desk   |   3 April 2018 11:26 AM GMT
ఢిల్లీలో బాబు!.. మ‌రో యూట‌ర్నేనా!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పోరాటం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రో మూడు రోజుల్లో పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు ముగియ‌నుండ‌గా, ఆలోగా ఏపీకి న్యాయం చేసేలా కేంద్రం నుంచి ప్ర‌క‌ట‌న రాకుంటే త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేస్తామ‌ని వైసీపీ లోక్ స‌భ స‌భ్యులు ఇప్ప‌టికే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాకుండా ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన త‌ర్వాత తామేమీ ఇళ్ల‌కు చేర‌బోమ‌ని, ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లోనే నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌లు కొన‌సాగిస్తామ‌ని కూడా వారు ప్ర‌క‌టించేశారు. కేంద్రాన్ని భ‌య‌పెట్టేందుకు ఇత‌ర పార్టీల నేత‌ల్లా చెల్ల‌ని రాజీనామాలు తాము చేయ‌మ‌ని, స్పీక‌ర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు చేస్తామ‌ని వారు చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు హోదా ఉద్య‌మాన్ని పీక్స్‌ కు తీసుకెళ్లింద‌నే చెప్పాలి.

ఇదే స‌మ‌యంలో ఏపీకి ఇప్పుడే ఏదో తీర‌ని న‌ష్టం జ‌రిగిపోయిన‌ట్లు, దానిని గుర్తించిన వెంట‌నే ఢిల్లీ ప‌య‌న‌మ‌య్యామ‌న్న‌ట్లుగా క‌ల‌రింగ్ ఇస్తున్న టీడీపీ అదినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ప‌ర్య‌ట‌న‌పై ఇప్పుడు విప‌క్షాలు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జ‌రిగిపోతున్నా మొద్దునిద్ర పోయిన చంద్ర‌బాబు... స‌రిగ్గా పార్ల‌మెంటు స‌మావేశాలు ముగిసే స‌మ‌యంలో ఢిల్లీకి వచ్చి ఏం సాధిస్తార‌న్న‌ది ఇప్పుడు అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌గా వినిపిస్తోంది. అయినా చంద్ర‌బాబు ఇప్పుడు ఢిల్లీకి వ‌చ్చి సాధించేది లేద‌ని ఇప్ప‌టికే విప‌క్ష వైసీపీ బ‌హాటంగానే ఆరోప‌ణ‌లు చేస్తున్న వైనం మ‌న‌కు తెలిసిందే. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం ఢిల్లీలో అడుగుపెట్టిన చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి కాసేప‌టి క్రితం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను చూస్తుంటే... ఏపీకి న్యాయం చేసేందుకు ఆయ‌న వ‌చ్చిన‌ట్లుగా క‌నిపించ‌డం లేదని, బీజేపీతో క‌లిసిపోయే క్ర‌మంలో మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకునే దిశ‌గానే క‌నిపిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు.

ఢిల్లీకి వ‌చ్చిన చంద్ర‌బాబు పార్లమెంటులో అందరి చేతులు పట్టుకుని చంద్రబాబు బతిమిలాడుతున్నారని... ఆయనను ఏ ఒక్క‌రు కూడా లెక్క చేయడం లేదని విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబును కలవాలంటూ టీడీపీ ఎంపీలు ఇతర పార్టీల నేతలను వేడుకుంటున్నారని ఆయ‌న త‌న‌దైన శైలిలో సుటైర్లేశారు. గతంలో ప్రత్యేక హోదా వద్దు -ప్యాకేజీ ఇవ్వాలని టీడీపీ నేతలు అన్నారని... హోదా కోసం పోరాడిన వారిపై టమోటాలు - రాళ్లు విసిరారని చెప్పారు. తాను ఎప్పటికీ వైయస్ కుటుంబ సభ్యుడినేనని చెప్పారు. తనను జైలుకు పంపించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని అన్నారు. ఏపీ మంత్రిగా ఉన్న లోకేష్ కు హైదరాబాదులో ఏం పని? అని ఆయ‌న‌ ప్రశ్నించారు. లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవడం వైసీపీకి అలవాటు లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ చేత విచారణ జరపాలని విజ‌య‌సాయిరెడ్డి డిమాండ్ చేశారు. మొత్తంగా చంద్ర‌బాబు ఢిల్లీ టూర్‌ పై విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశార‌ని చెప్పాలి.