Begin typing your search above and press return to search.

విజయసాయి బిల్లుపై మోడీ సర్కారు ఆలోచనలు అలా ఉన్నాయా?

By:  Tupaki Desk   |   21 Aug 2022 10:30 AM GMT
విజయసాయి బిల్లుపై మోడీ సర్కారు ఆలోచనలు అలా ఉన్నాయా?
X
'ఏపీ రాజధాని అమరావతే. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతిని రాజధానిగా చేస్తూ మరింత వేగంగా విస్తరించే ప్రయత్నం చేస్తాం. మీరెలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మా ప్రభుత్వం వస్తే అమరావతి తరలిపోతుందన్న విష ప్రచారాన్ని నమ్మొద్దు' అంటూ వైఎస్ జగన్ చెప్పిన మాటలు చేతల్లోకి వచ్చేసరికి ఏమయ్యాయన్నది తెలిసిందే. ఏపీ రాజధానిని అమరావతిలోనే కంటిన్యూ చేస్తామన్న దానికి భిన్నంగా ఒక రాజధానికి మూడు రాజధానులు తీసుకురావటం.. దానిపై సాంకేతిక అంశాలు ముడిపడి ఉండటంతో.. కేంద్రం ఆమోదానికి మూడు రాజధానులపై ప్రైవేటు బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.

ఇదిలా ఉంటే.. మూడు రాజధానులపై కేంద్రంలోని మోడీ సర్కారు అనుకూలంగా ఉందంటూ జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఓవైపు ఏపీ రాజధాని అమరావతే అన్న విషయాన్ని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా జాతీయ పార్టీ మూడు రాజధానులకు మొగ్గు చూపుతుందా? విజయసాయి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు సానుకూలంగా స్పందిస్తుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది.

జాతీయ మీడియాలో వచ్చిన కథనాల్ని చూస్తే.. ఇటీవల బిహార్ లోని నితీశ్ ప్రభుత్వం బీజేపీ స్నేహాన్ని కటీఫ్ చేసుకొని.. ఒకప్పటి తన బద్ధశత్రువుతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. ఈ కారణంగా రాజ్యసభలో బీజేపీకి తగ్గిన బలాన్ని వైసీపీకి ఉన్న ఎంపీలతో భర్తీ చేసుకునేలా మోడీ సర్కారు ప్లాన్ చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మూడు రాజధానుల బిల్లుకు సానుకూలంగా స్పందిస్తారంటూ అంచనాల్ని వ్యక్తం చేస్తూ కథనాలు వెలువరించారు.

అయితే.. ఈ తరహా వాదనలో ఏ మాత్రం పస లేదంటున్నారు. మూడు రాజధానులకు కేంద్రంలోని మోడీ సర్కారు మద్దతు ఇస్తేనే వైసీపీ ఎంపీలు అండగా ఉంటారన్నది ఏ మాత్రం నిజం కాదంటున్నారు. మూడు రాజధానులకు కేంద్రం ఓకే చెప్పినా.. చెప్పకున్నా మోడీ సర్కారుతో తన స్నేహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తారని చెబుతున్నారు.

నిజానికి జగన్ తో మోడీ సర్కారుకు అవసరం కంటే కూడా.. మోడీ సర్కారుతో జగన్ సర్కారుకే ఎక్కువ అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు. మరి.. జాతీయ మీడియాలో కథనాలు? అన్న క్వశ్చన్ కు.. 'ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది?' అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. సో.. మూడురాజధానులపై విజయసాయి ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుకు మోడీ సర్కారు సానుకూలంగా ఉందంటూ వెలువడే జాతీయ మీడియా కథనాలు.. మూడు రాజధానుల అంశంపై మరింత నెగిటివిటీని పెంచే ప్రమాదం పొంచి ఉందంటున్నారు.