Begin typing your search above and press return to search.

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు...వైసీపీ వ్యూహం!

By:  Tupaki Desk   |   9 Jun 2018 9:33 AM GMT
ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు...వైసీపీ వ్యూహం!
X
ప్ర‌త్యేక హోదా - విభ‌జ‌న హామీల అమ‌లపై కేంద్రం నిర్ల‌క్ష్య వైఖ‌రికి నిర‌స‌న‌గా వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఏదో నామ్ కా వాస్తే రాజీనామాలు చేశాం....ప‌బ్లిసిటీ వ‌చ్చింది అన్న చందంగా కాకుండా త‌మ రాజీనామాలు ఆమోదించాల్సిందిగా స్పీక‌ర్ పై ప‌దే ప‌దే ఒత్తిడి తెచ్చారు. మే 29 - జూన్ 9 తేదీల్లో స్పీక‌ర్ సుమిత్రా మ‌హ‌జ‌న్ ను క‌లిసి రాజీనామాల ఆమోదానికి ప‌ట్టుబ‌ట్టారు. మ‌రో ఏడాది వ్య‌వ‌ధి ఉండ‌గానే త‌మ ప‌ద‌వులకు స్పీక‌ర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి నిబ‌ద్ధ‌త‌ను చాటుకున్నారు. వైసీపీ నేత‌ల నిబ‌ద్ధ‌త‌ను చూసిన స్పీక‌ర్ వారి రాజీనామాల‌ను ఆమోదిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అధికారికంగా పార్ల‌మెంట్ బులిటెన్ లో ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి. ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స్పీక‌ర్ స్వ‌దేశానికి రాగానే వాటిని ఆమోదించ‌నున్నారు. అయితే, రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలు పోతూ పోతూ మ‌రో ముగ్గురు `జంప్ జిలానీ`ఎంపీల‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

వైసీపీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో గెలుపొంది.....ఆ త‌ర్వాత స్వ‌లాభం కోసం స్వార్థ‌పూరితంగా టీడీపీలో చేరిన ఎస్పీవై రెడ్డి - కొత్త‌ప‌ల్లి గీత‌ - బుట్టా రేణుకల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించాలంటూ స్పీక‌ర్ కు లేఖ‌లు రాశారు. వారు పార్టీ మారిన‌ట్లు ఆధారాల‌తో స‌హా స్పీక‌ర్ కు లేఖ‌లు స‌మ‌ర్పించారు. అయితే - గీత‌ - ఎస్పీవై రెడ్డిలు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ‌డాన్ని పార్ల‌మెంట‌రీ డిసిప్ల‌న‌రీ క‌మిటీ త‌ప్పుప‌ట్టిందని తెలుస్తోంది. వారిపై చ‌ర్య‌ల‌కు స్పీక‌ర్ కూడా సిద్ధమైన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, రేణుక‌కు సంబంధించి మ‌రిన్ని ఆధారాలు సేక‌రించి ఆమెపై కూడా పార్ల‌మెంట‌రీ డిసిప్ల‌నరీ క‌మిటీకి ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. టీడీపీ మ‌హానాడులో రేణుక పాల్గొన‌డం...అక్క‌డ చేసిన హంగామా.....త‌దిత‌ర వీడియోల‌ను వైసీపీ నేత‌లు క‌మిటీకి స‌మ‌ర్పించ‌నున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి త‌మ రాజీనామాలు - జంప్ జిలానీలైన ఆ ముగ్గురిపై అన‌ర్హత ప‌డేలా చేసి.....ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న త‌ర‌హాలో వైసీపీ ఎంపీలు వ్యూహ‌ర‌చ‌న చేశారు. జూన్ 19న స్వ‌దేశానికి చేరుకోనున్న స్పీక‌ర్ కోసం వైసీపీ నేత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.