Begin typing your search above and press return to search.

ఢిల్లీలో క‌ల‌క‌లం!..వైసీపీ రాజీనామా ప‌త్రాలు సిద్ధం!

By:  Tupaki Desk   |   28 March 2018 7:35 AM GMT
ఢిల్లీలో క‌ల‌క‌లం!..వైసీపీ రాజీనామా ప‌త్రాలు సిద్ధం!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఉద్య‌మం నిజంగానే ఇప్పుడు ప‌తాక స్థాయికి చేరిపోయింద‌ని చెప్పాలి. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఆది నుంచి పోరు సాగిస్తున్న వైసీపీ... మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీ ప్ర‌స్తావ‌న లేని వైనంపై భగ్గుమ‌న‌డ‌మే కాకుండా హోదా పోరును మ‌రింత ఉధృతం చేసేసింది. ఈ క్ర‌మంలో అప్ప‌టిదాకా ప్ర‌త్యేక హోదా అంటే జైల్లో పెట్టేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసిన అధికార టీడీపీ కూడా వైసీపీ జోరుతో మాట మార్చ‌క త‌ప్ప‌లేదు. ప్ర‌త్యేక హోదా వ‌ద్దు... ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చినా స‌రిపోతుంద‌ని చెప్పిన నోటితోనే ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కావాల‌ని టీడీపీ వాదిస్తోంది. వాదించ‌డ‌మే కాకుండా కేంద్ర కేబినెట్ లోని త‌న ఇద్ద‌రు మంత్రుల‌తో రాజీనామాలు చేయించిన టీడీపీ... ఏకంగా ఎన్డీఏ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయితే ప్ర‌త్యేక హోదా పోరులో ఏ ఒక్క‌రికి కూడా అంద‌నంత ఎత్తులో ఉన్న వైసీపీ... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం త‌మ ఎంపీలు రాజీనామాల‌కు కూడా వెనుకాడ‌బోర‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఇదే మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని మొన్న‌టికి మొన్న విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పార్ల‌మెంటు స‌స‌మావేశాల చివ‌రి రోజులోగా రాష్ట్రానికి న్యాయం జ‌ర‌గ‌ని ప‌క్షంలో త‌మ ఎంపీల‌తో రాజీనామాలు చేయిస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. తామేదో అదాటుగా రాజీనామాలు చేయ‌బోవ‌డం లేద‌ని, ఏకంగా స్పీక‌ర్ ఫార్మాట్ లోనే రాజీనామాలు చేసేస్తామ‌ని కూడా జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌కు అనుకూలంగానే వైసీపీ ఎంపీలంతా ఇప్పుడు ఏకంగా రాజీనామా పత్రాల‌ను జేబుల్లో పెట్టుకుని మ‌రీ పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌రువుతున్నార‌ని క‌థ‌నాలు వినిపించాయి. అయితే ఆ క‌థ‌నాలు ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. అయితే ఆ క‌థ‌నాలు ముమ్మాటికీ నిజ‌మేన‌ని కాసేప‌టి క్రితం తేలిపోయింది. ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లుగా వైసీపీ ఎంపీలు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏకంగా త‌మ ఎంపీ ప‌ద‌వుల‌ను తృణ‌ప్రాయంగా వ‌దులుకునేందుకు కూడా వెనుకాడటం లేద‌ని తేలిపోయింది.

ఎప్ప‌టిలానే నేటి పార్ల‌మెంటు స‌మావేశాల్లో కూడా బీజేపీ వ్యూహం ప్ర‌కారం అన్నాడీఎంకే ఎంపీలు స‌భా కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకున్నారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాల్సిందేన‌ని నిన‌దిస్తూ... స‌మావేశాలు ప్రారంభం కాగానే లోక్ స‌భ‌లో పోడియంను చుట్టుముట్టారు. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో అన్యాయం చేసిన బీజేపీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన వైసీపీ - టీడీపీ - కాంగ్రెస్ పార్టీలు త‌మ తీర్మానాల‌పై చ‌ర్చ‌కు డిమాండ్ చేశాయి. అయితే స‌భ ఆర్డ‌ర్‌లో లేని కార‌ణంగా అవిశ్వాస తీర్మానాల‌పై చ‌ర్చ‌కు అనుమ‌తించేది లేద‌న్న పాత మాట‌నే చెప్పిన లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ స‌భ‌ను వాయిదా వేశారు. ఈ ప‌రిణామంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వైసీపీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్... లోక్ స‌భ నుంచి బ‌య‌టకు వ‌చ్చిన వెంట‌నే మీడియా ముందుకు వ‌చ్చారు. వ‌చ్చీ రావ‌డంతోనే త‌న జేబులో ఉన్న రాజీనామా లేఖ‌ను చూపించేసిన వ‌ర‌ప్ర‌సాద్‌... లోక్ స‌భ స‌మావేశాల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదే త‌ర‌హాలో పార్ల‌మెంటు స‌మావేశాలు వాయిదా ప‌డుతూ ఉంటే... అందుకు నిర‌స‌న‌గా ఏకంగా త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

స్పీకర్ ఫార్మాట్‌ లో సిద్ధం చేసిన పత్రాలను వ‌ర‌ప్ర‌సాద్‌ మీడియాకు చూపించారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రస్తుత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు ఆనాడు యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని, అలాగే ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ తిరుపతి ప్రచార సభలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి మాట తప్పారని వరప్రసాద్ ఆరోపించారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌కు మోసం చేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తీరు కొన‌సాగితే ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తామ‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. మొత్తంగా రాజీనామా ప‌త్రాల‌ను జేబుల్లోనే పెట్టుకుని పార్ల‌మెంటుకు హాజ‌ర‌వుతున్నామ‌ని చెప్పిన వ‌ర‌ప్ర‌సాద్‌... ఢిల్లీ వేదిక‌గా కొన‌సాగుతున్న ప్ర‌త్యేక హోదా పోరును తారాస్థాయికి తీసుకెళ్లార‌నే చెప్పాలి.