Begin typing your search above and press return to search.

మళ్లీ ఇంకో అవిశ్వాసమా జగన్..?

By:  Tupaki Desk   |   15 March 2016 10:10 AM IST
మళ్లీ ఇంకో అవిశ్వాసమా జగన్..?
X
ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయటానికి... ప్రభుత్వ విధానాల్ని దునుమాడటానికి విపక్షానికి అవిశ్వాస తీర్మానం ఒక అయుధమన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన మీద.. ఆయన అనుసరిస్తున్న విధానాల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టటం.. ఈ అంశంపై సోమవారం సుదీర్ఘంగా చర్చ సాగటం తెలిసిందే.

ఈ చర్చ సందర్భంగా వాదోపవాదాలు చేసుకోవటంతో పాటు.. సభ్యులు ఎవరికి వారు హద్దులు దాటి కొన్ని వ్యక్తిగత విమర్శలు చేసుకోవటం తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ఇదిలా ఉంటే.. ఓపక్క అవిశ్వాస తీర్మానం వీగిపోయి కొద్ది నిమిషాలు కూడా పూర్తి కాక ముందే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము మంగళవారం మరో అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.

ఓపక్క అవిశ్వాస తీర్మానం వీగిపోయి కొద్ది నిమిషాలు కూడా పూర్తి కాని వెంటనే.. జగన్ బ్యాచ్ ఎమ్మెల్యే మరో అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించటం ఆశ్చర్యకరంగా మారిన పరిస్థితి. అయితే.. ఈసారి ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వైఖరి మీద అసంతృప్తితో అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు వెల్లడించారు. స్పీకర్ వైఖరి ఏ మాత్రం బాగోలేదని.. ఒక నిమిషం జగన్ మాట్లాడితే.. అరగంట నుంచి గంట సేపు టీడీపీ నేతలతో తిట్టించే పని చేశారని.. ఈ నేపథ్యంలోనే స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తమ పార్టీ నిర్ణయించినట్లు ప్రకటించారు.

ఏమైనా ఒక అవిశ్వాస తీర్మానం వీగిపోయి నిమిషాలు కూడా పూర్తి కాని సందర్భంలో మరో అవిశ్వాస తీర్మానం గురించి ప్రకటన జగన్ బ్యాచ్ ఎమ్మెల్యే చేయటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. చూస్తుంటే.. జగన్ అవిశ్వాస తీర్మానాల సీరియల్ ను షురూ చేసినట్లుందే..?